Hyderabad Metro: శుభవార్త చెప్పిన మెట్రో.. నిమజ్జనం రోజు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు..
గణేషుడి భక్తులకు మెట్రో శుభవార్త చెప్పింది. నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 17 మంగళవారం నిమజ్జనం రోజున మెట్రో సర్వీసులను పొడిగించనున్నట్లు తెలిపింది. నిమజ్జనం అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. మెట్రో మార్గాల్లో సెప్టెంబర్ 17న రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.
చివరి మెట్రో ట్రైన్ సెప్టెంబర్ 18న 1AM కు ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రయాణికులు వారి ఇళ్లకు వెల్లొచ్చని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్య ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్ కు వచ్చే మెట్రో ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అధిక ఫ్రీక్వెన్సీతో అదనపు రైళ్లు రద్దీ సమయాల్లో నడపనున్నట్ల మెట్రో పేర్కొంది.

కరోనా సమయంలో మెట్రోకు భారీ నష్టాలు వచ్చాయి. కాని ఇప్పుడు క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. గత వారం, పది రోజులుగా మెట్రో రైళ్లు ప్రయాణించే వారు పెరిగారు. భారీ వర్షాలతో పాటు వినాయక చవితి రావడంతో రద్దీ పెరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజూ 5 లక్షల మార్కును దాటుతున్నట్లు తెలిసింది. ఖైరతాబాద్ గణేష్ సందర్శకులు మెట్రో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగినట్లు సమాచారం. శనివారం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు దాదాపు 94వేల మంది ప్రయాణికులు వచ్చారు. ఈ స్టేషన్ లో 39,000 ఎంట్రీలు, 55,000 ఎగ్జిట్లు నమోదైనట్లు మెట్రో అధికారులు తెలిపారు.
కాగా ఖైరతాబాద్ గణేషుడి దర్శనం నేటి అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. ఆ తర్వాత దర్శనం నిలిపివేస్తారు. ఆ తర్వాత వెల్డింగ్ పనులు చేపడతారు. మంగళవారం ఉదయం ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications