గాంధీభవన్‌లో ఉద్రిక్తత: దిగ్విజయ్ ఉండగానే అనిల్, ఓయూ నేతల ఘర్షణ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు ఇప్పట్లో తేలేలా లేవు. ఇప్పటికే టీపీపీ చీఫ్ రేవంత్ రెడ్డికి, సీనియర్ పార్టీ నేతల మధ్య విభేదాలను తగ్గించేందుకు అధిష్టానం జాతీయ నేత దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్ కు పంపిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్.. గాంధీభవన్‌లో గురువారం ఉదయం నుంచి వరుసగా సీనియర్ నేతలతో సమావేశమవుతున్నారు.
ఈ క్రమంలోనే గాంధీభవన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఓయూ ఎన్ఎస్‌యూఐ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సీనియర్ నేతలపై అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ క్షమాపణలు చెప్పాలంటూ గాంధీభవన్‌లో ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో పలువురు నేతలు గల్లాలు పట్టుకుని ఘర్షణలకు పాల్పడటంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓ వైపు సేవ్ కాంగ్రెస్ అని సీనియర్ నేతల వర్గం వారు నినాదాలు చేస్తుండగా.. మరోవైపు జై కాంగ్రెస్ అంటూ మరో వర్గం నేతలు నినాదాలు చేశారు.
ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు కల్పించుకుని ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అనిల్ కుమార్‌ను గాంధీభవన్ లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత మల్లు రవి ఓయూ నేతలతో మాట్లాడి వారికి సర్ది చెప్పారు. దీంతో ఇరువర్గాలు శాంతించాయి. దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్‌లో ఉండగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడవలు, విభేదాలు లేవన్నారు. అంతా సర్దుకుంటాయన్నారు. ఎవరూ కూడా మీడియా ముందు పార్టీ విషయాలు మాట్లాడకూడదన్నారు. దిగ్విజయ్ సింగ్ నేతలందరితోనూ మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదన్నారు.












Click it and Unblock the Notifications