రేవంత్ రెడ్డి సర్కారుపై బండ్ల గణేష్ ప్రశంసలు: మేడారంలో ప్రత్యేక పూజలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్లగణేశ్(Bandla Ganesh) కొనియాడారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పని చేస్తోందని పేర్కొన్నారు.
పరిపాలన అనుభవం లేకపోయినా మొదటిసారి సీఎం అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని బండ్ల గణేష్ తెలిపారు. ఇప్పటికే అధికారం చేపట్టి రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశారని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి కేంద్రంతో తత్సంబంధాలు నెలకొనేలా ముందుకు వెళ్లడం శుభపరిణామమని, ఈ సంబంధాలు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుందని బండ్ల గణేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రుల దగ్గర రాష్ట్ర సమస్యల గురించి వివరించడం చాలా గొప్ప విషయమని అన్నారు. సీఎం రేవంత్‌కి ప్రజల్లో మంచి పేరు వస్తోందని, ఇది ఇలాగే కొనసాగాలని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు.
మేడారంలో మొక్కులు చెల్లించుకున్న బండ్ల గణేష్
మేడారం సమ్మక్క-సారమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు బండ్ల గణేష్. కుటుంబ సమేతంగా వచ్చిన బండ్ల గణేష్ కు గిరిజన సాంప్రదాయం ప్రకారం జాతర కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఆ తర్వాత గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేశారు.
మరోవైపు, మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు రోజు కావడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాలలో ఉన్న భక్తులు కూడా కుటుంబ సమేతంగా వచ్చి.. సమ్మక్క-సార్కలను దర్శించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications