Cyber Crime: ఖాతాదారుడి డబ్బును సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా కాపాడిన ఎస్బీఐ..
సైబర్ నేరగాళ్ల చేతిలో నష్టపోకుండా ఉండేందుకు బ్యాంకులు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లోని సిబ్బంది అధునాతన డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ను విజయవంతంగా అడ్డుకున్నారు. ఖాతాదారుడు మోసపోకుండా కాపాడారు. 78 ఏళ్ల డాక్టర్ తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఖాతా నుంచి రూ. 30 లక్షలు సైబర్ నేరగాళ్ల అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ కాకుండా అడ్డుకున్నారు. అంతే కాదు ఇందుకు సంబంధించి పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు.
ఈ ఘటన ఎస్‌బిఐ లోతుకుంట బ్రాంచ్ లో జరిగింది. విశ్రాంత వైద్యుడైన బాధితుడికి బుధవారం ఇంట్లో ఉండగా సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. తాము కస్టమ్స్ అధికారులమని పరిచయం చేసుకున్నారు. మలేషియా వైద్యుడి నుంచి మీకు పార్శిల్ వచ్చిందని చెప్పారు. కాసేపటి తర్వాత ఢిల్లీ పోలీసులమని చెప్పి మరో కాల్ వచ్చింది. రూ.88 కోట్ల మనీలాండరింగ్ కేసులో వైద్యుడి ప్రమేయం ఉందని, ఆధార్ వివరాలను ఉపయోగించి అతని పేరిట 30 బ్యాంకు ఖాతాలను మోసపూరితంగా తెరిచారని వారు భయపెట్టారు.

అయితే న్యాయపరమైన సహాయం చేసి రక్షిస్తామని నమ్మబలికారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ SCSS ఖాతాను మూసివేసి అందులో ఉన్న రూ. 30 లక్షల బ్యాలెన్స్‌ను తమ ఖాతాకు బదిలీ చేయాలని కోరాడు. ఇది నమ్మిన బాధితుడు బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఎస్బీఐ లోతుకుంట శాఖకు వెళ్లారు.
బ్యాంకు వద్ద డాక్టర్ ఆందోళనగా కనిపించడం, అతను తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడడాన్ని బ్యాంకు సిబ్బంది గుర్తించారు. వెంటనే మేనేజర్ జీ. నవీన్ కు చెప్పారు. ఆయన వచ్చి బాధితుడిని ఎందుకు ఖాతా మూసివేస్తున్నారని అడిగారు.
జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో తన భార్య చికిత్స కోసం నిధులు అవసరమని బాధితుడు చెప్పాడు. కానీ మేనేజర్ మాత్రం డౌట్ గా అనిపించింది. డబ్బులు బదిలీ కాకుండా వెంటనే ప్రాంతీయ వ్యాపార కార్యాలయాన్ని అప్రమత్తం చేసి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అక్కడి చేరుకుని బాధితుడిని విచారించారు. దీంతో వైద్యుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. పోలీసులు ఇదంతా సైబర్ నేరగాళ్ల పని ఆయనకు వివరించారు. ఈ కేసులో ఎస్‌బీఐ సిబ్బంది అప్రమత్తత, హైదరాబాద్ పోలీసులు సత్వరమే స్పందించడంతో బాధితుడు బతికిపోయాడు.












Click it and Unblock the Notifications