కుక్కల దాడిలో బాలుడు మృతి: జీహెచ్ఎంసీపై హైకోర్టు ఆగ్రహం, నోటీసులు జారీ
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో నాలుగు రోజు లక్రితం కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో నాలుగు రోజు లక్రితం కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. గురువారం విచారించింది. నాలుగేళ్ల బాలుడిని కుక్కలు దాడి చేసి చంపడం అమానుషమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బాలుడి మృతి అత్యంత బాధాకరమని పేర్కొంది.
అసలు జీహెచ్ఎంసీ ఏం చేస్తోందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ నిర్లక్ష్యం వల్లే పసి బాలుడు చనిపోయాడని జీహెచ్ఎంసీపై మండిపడింది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని జీహెచ్ఎంసీని, ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ, అంబర్‌పేట మున్సిపల్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

బాలుడు మృతికి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్న హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 16కు వాయిదా వేసింది.
అంబర్‌పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. కుక్కలు దాడులు చేస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే అనడం సరికాదని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. కుక్కల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications