మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
Odisha boat capsize: ఒడిశాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మహానదిలో సంభవించిన పడవ ప్రమాదంలో ఏడుమంది గల్లంతయ్యారు. ఒకరు జలసమాధి అయ్యారు. గల్లంతయిన వారి కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 40 మంది సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు. నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియోను ప్రకటించారు. గల్లంతయిన వారి కోసం చేపట్టిన సహాయక చర్యలను ఆయన స్వయంగా సమీక్షించారు. జిల్లా అధికారుల నుంచి నివేదికలను తెప్పించుకున్నారు.

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా లఖన్‌పూర్ బ్లాక్‌లో ఈ దుర్ఘటన సంభవించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఖార్సియాకు చెందిన 50 మంది బంజిపలిలో వెలిసిన ఆలయాన్ని దర్శించడానికి లఖన్‌పూర్ శారదా ఘాట్‌కు వచ్చారు. మహానదికి అటువైపున ఉన్న ఆలయానికి వెళ్లడానికి పడవలో బయలుదేరారు. శారదా ఘాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి పడవ బోల్తా పడింది.
స్థానికులు, మత్స్యకారులు 40 మందిని రక్షించారు. మరో ఏడుమంది గల్లంతయ్యారు. వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఝార్సుగూడ జిల్లా కలెక్టర్ అబోలి సునీల్ నరవనె, ఒడిశా నార్త్ రేంజ్ ఐజీ హిమాన్షు లాల్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.

సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు పాల్గొంటోన్నాయి. చీకటి అయినప్పటికీ- ఫోకస్ లైట్లను వినియోగించారు. సంఘటన స్థలం నుంచి నదీ ప్రవాహం దిగువన ఎనిమిది కిలోమీటర్ల వరకు విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టామని కలెక్టర్ తెలిపారు.












Click it and Unblock the Notifications