మోదీ.. ఇక పాన్ వరల్డ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తోన్న రేడియో కార్యక్రమం మన్ కీ బాత్. ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు బ్రాడ్‌కాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఇది. 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన దీన్ని కొనసాగిస్తూ వస్తోన్నారు. ఆ ఏడాది అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 45 నిమిషాల నుంచి గంట పాటు రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.
దేశంలోని మారుమూల గ్రామాలు, అక్కడి ప్రజలు, సంస్కృతి-సంప్రదాయాలను సైతం మోదీ ఇందులో ప్రస్తావించారు. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ప్రజల ప్రత్యేకతలను వివరించారు. ప్రపంచం నలుమూలలా స్థిరపడిన భారతీయుల గొప్పదనాన్ని దేశ ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశారాయన. పండగల ప్రత్యేకతలను వివరించారు. వాటిని జరుపుకోవాల్సిన అవసరాన్నీ గుర్తు చేశారు.

ఈ రేడియో కార్యక్రమం ద్వారా మోదీ ప్రశంసలు పొందిన తెలుగువారు చాలామందే ఉన్నారు. ఈ ప్రీరికార్డెడ్ ప్రోగ్రామ్ సరికొత్త రికార్డును నెలకొల్పబోతోంది. ఇవ్వాళ 100వ ఎపిసోడ్‌ను పూర్తి చేసుకోబోతోంది. ఇప్పటివరకు 99 ఎపిసోడ్‌లు నిరాటంకంగా పూర్తయ్యాయి. ఈ 100 ఎపిసోడ్ బ్రాడ్‌కాస్ట్‌ను దేశవ్యాప్తంగా వైభవంగా నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు పూర్తి చేసింది. ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమాన్ని బ్రాడ్ కాస్ట్ చేయడానికి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యాలయాలు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. అలాగే- దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్ మొదలుకుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ల అధికారిక నివాసం రాజ్‌భవన్‌లల్లో ఈ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అటు ఐక్యరాజ్య సమితి కూడా ఈ 100 ఎపిసోడ్‌ను ప్రసారం చేయనుంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోని ట్రస్టీషిప్ కౌన్సిల్ ఛాంబర్‌లో దీన్ని ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలోనూ ఇది బ్రాడ్‌కాస్ట్ అవుతుంది. ఈ వందో ఎపిసోడ్ కోసం న్యూజెర్సీలో ప్రవాస భారతీయులు ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు.

ఇండియన్-అమెరికన్ అండ్ డయాస్పొరా కమ్యూనిటీని సమావేశపరిచారు. ఫ్రెంచ్, చైనీస్, ఇండొనేషియన్, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పాష్తు, పర్షియన్, దరి, స్వాహిలి భాషల్లో ఇది బ్రాడ్ కాస్ట్ అవుతుంది. చారిత్రాత్మకమైన ఈ వందో ఎపిసోడ్ ద్వారా ప్రధాని దేశ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications