రచయిత హత్య: అవార్డు వెనక్కి ఇస్తున్న రచయిత్రి
బెంగళూరు: ప్రముఖ కన్నడ రచయిత, మాజీ కులపతి ఎం.ఎం. కలబుర్గి హత్యకు నిరసనగా సాహిత్య అకాడమి పురస్కారాలు తిరిగి ఇస్తున్న వారి లిస్టులో కన్నడ రచయిత్రి చేరిపోయారు. కర్ణాటకకు చెందిన రియా వితాషా (17) అనే యువతి తనకు ఇచ్చిన అవార్డును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తానని అంటున్నారు.
రియా వితాషా పీయుసీ (ఇంటర్) మొదటి సంవత్సరం చదువుతున్నారు. ముద్దు తీర్థహళ్లి అనే కలం పేరుతో ఈమె నవలలు వ్రాస్తున్నారు. ఒందు చంద్రాణ తుందు అనే వ్యాస సంపుటికి 2011లో కర్ణాటక ప్రభుత్వం ఈమెకు సాహిత్య అకాడమి అవార్డు ఇచ్చి సత్కరించింది.
కలబుర్గి హత్య కేసులో ఇంత వరకు నేరస్తులను గుర్తించకపోవడం అవేదన కలిగించిందని, అంతే కాకుండ నిందితులను శిక్షించడంలో విఫలమైన కర్ణాటక ప్రభుత్వ వైఖరికి నిరసనగా తన అవార్డును వెనక్కి ఇస్తున్నానని రియా వితాషా అంటున్నారు. చిన్నతనం నుంచి కలబుర్గి తనకు తెలుసు ఆమె చెప్పారు.
కలబుర్గి హత్యకు గురైన సమయంలోనే తాను అవార్డు వెనక్కి ఇవ్వాలని కుటుంబ సభ్యులకు చెప్పానని, అయితే ఓపిక పట్టాలని వారు వారించడంతో ఇంతకాలం వేచి ఉన్నానని రియా వితాషా చెబుతున్నారు.

రియా వితాషా తీసుకున్న నిర్ణయంపై ఆమె తల్లి లిడియా డి మెల్లో హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ కన్నడ రచయిత చంద్రశేఖర్ పాటిల్ తన అవార్డును వెనక్కి ఇచ్చేసిన విషయం తెలుసుకున్న తరువాత తన కుమార్తె ఈ నిర్ణయం తీసుకుందని లిడియా డి మెల్లో తెలిపారు.
అయితే రియా వితాషా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని పలువురు రచయితలు అంటున్నారు. ఇంత చిన్న వయస్సులో ఆమె గొప్ప నిర్ణయం తీసుకున్నారని మరి కొందరు అంటున్నారు. ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications