ఘోరం: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం -18 మంది సజీవ దహనం -లోపలే ఇంకొందరు -ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని పారిశ్రామిక నగరం పుణెలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో 18 మంది కార్మికులు, సిబ్బంది సజీవదహనం అయ్యారు. ఇంకొందరు సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. మహారాష్ట్ర చరిత్రలో అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటైన పుణె ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పుణెకు సమీపంగా ఉండే ముల్షీ తాలూకాలోని పిరంగుట్ లో ఇండస్ట్రియల్ ఏరియా విస్తరించి ఉంది. అక్కడి ఉరవాడే వద్ద ఎస్‌వీఎస్ ఆక్వా టెక్నాలజీస్ అనే పరిశ్రమలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. నీటిశుద్ధికి వినియోగించే క్లోరిన్ డైయాక్సీ మాత్రలు తయారు చేసే సదరు రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికీలలకు 18మంది సజీవ దహనమయ్యారు. . పరిశ్రమలో మరో 15 నుంచి 16 మంది చిక్కుకున్నట్లు సమాచారం.

ప్రమాద ఘటనను తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక బృందాలు ఫ్యాక్టరీ వద్దకు చేరాయి. మొత్తం 5 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతూ, రెస్క్యూ సిబ్బంది కార్మికుల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఇంకా కొందరు సిబ్బంది లోపలే ఉండొచ్చని, వారికోసం గాలిస్తున్నామని పుణె రూరల్ ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్ మీడియాకు తెలిపారు.
పుణె పారిశ్రామిక ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనేదానిపై దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షల నష్టపరిహారం, గాయపడ్డవారికి రూ.50వేలు అందజేస్తామని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. పుణె అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications