వీడొక్కడే సినిమా తరహాలో షాకయ్యేలా కడుపులో 30కోట్ల కొకైన్.. ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్!!
ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు ఇద్దరు నైజీరియన్లు కడుపులో 30 కోట్ల విలువ చేసే కొకైన్ ను తరలిస్తుండగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న పలువురిని పట్టుకోవడం, వారి వద్ద భారీ మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం ముంబైలో డ్రగ్స్ మాఫియా ఎంతగా చెలరేగిపోతుందో చెబుతోంది. మొన్నటికి మొన్న సబ్బులలో 25 కోట్ల విలువైన కొకైన్ ను పట్టుకున్న డిఆర్ఐ అధికారులు, ఇక తాజాగా దాదాపు 30 కోట్ల విలువైన డ్రగ్స్ ను తరలిస్తుండగా పట్టుకున్నారు. వీడొక్కడే సినిమా తరహాలో కడుపులో 30 కోట్ల విలువైన డ్రగ్స్ ను క్యాప్సూల్స్ రూపంలో మింగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న వారి గుట్టు రట్టు చేసారు డిఆర్ఐ అధికారులు.

ముంబై ఎయిర్ పోర్ట్ లో డ్రగ్స్ దందా చేస్తున్న ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే డ్రగ్స్ దందా చేస్తున్న డ్రగ్స్ మాఫియా ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి డ్రగ్స్ తీసుకురావడానికి ముంబై ఎయిర్ పోర్ట్ ను కేంద్రంగా చేసుకుంది. కస్టమ్స్ మరియు డీఆర్ఐ అధికారులకు పట్టు పడకుండా వివిధ మార్గాలలో డ్రగ్స్ దందా చేస్తుంది.
ఇక తాజాగా డీఆర్ ఐ అధికారులకు అందిన పక్కా సమాచారంతో ముంబై విమానాశ్రయంలో తనిఖీలు చేసిన అధికారులు నైజీరియా నుంచి ఇండియాలోకి డ్రగ్స్ రవాణా చేసేందుకు ప్రయత్నం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.

కడుపులో క్యాప్సూల్స్ రూపంలో డ్రగ్స్
లాగోస్ నుంచి అడీస్ అబాబా మీదుగా ముంబైకి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన డి ఆర్ ఐ అధికారులు వారి బ్యాగ్ లో ఎటువంటి డ్రగ్స్ లభించకపోవడంతో, అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న వారి తీరును గుర్తించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో వారి కడుపులో డ్రగ్స్ ఉన్నట్టు డిఆర్ఐ వర్గాలు గుర్తించాయి. దీంతో నిందితులిద్దరిని కోర్టులో హాజరు పరిచి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కడుపులో క్యాప్సూల్స్ రూపంలో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు.

30 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
నైజీరియా నుండి వచ్చిన అరెస్టు అయిన ఇద్దరు నిందితుల కడుపునుండి క్యాప్సుల్స్ బయటకు తీసి 2. 976 కిలోల కొకైన్ ను డిఆర్ఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు . అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర 29 కోట్ల 76 లక్షలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు నిందితులిద్దరినీ జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.
ఇక ఇటీవల కాలంలో వరుసగా ముంబై ఎయిర్పోర్టు కేంద్రంగా అడిస్ అబాబా నుండి డ్రగ్స్ తీసుకువస్తూ పట్టుబడుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇది ముంబై కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను స్పష్టంగా చెబుతున్నాయి. దీంతో ఈ కేసులలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు డీఆర్ఐ అధికారులు.












Click it and Unblock the Notifications