దేశంలో 63కు పెరిగిన జేఎన్.1 వేరియంట్ కేసులు: తెలంగాణతోపాటు ఈ రాష్ట్రాల్లోనే వెలుగులోకి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4054కు చేరడం గమనార్హం. అలాగే, కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు 63కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది.
అత్యధికంగా గోవాలో 34 కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడగా.. మహారాష్ట్రలో తొమ్మిది మంది ఈ వేరియంట్ బారినపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో 8 మంది, కేరళలో ఆరుగురు, తమిళనాడులో నలుగురు, తెలంగాణలో ఇద్దరు కొత్త వేరియంట్ జేఎన్1 బారినపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం తన ప్రకటనలో పేర్కొంది.

జేఎన్.1 వేరియంట్ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం వరకు జేఎన్1 వేరియంట్ కు సంబంధించి తొలి కేసు వెలుగుచూసిన విషయం తెలిసిందే. 79 ఏళ్ల మహిళకు ఈ వేరియంట్ సోకింది. అయితే, ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని.. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
ప్రస్తుత శీతాకాల సీజన్ పరిగణలోకి తీసుకుని కోవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి. జేఎన్1 గురించి ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జేఎన్1 వేరియంట్ కేసులు ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. అమెరికా, చైనా, సింగపూర్ లతోపాటు భారత్‌లోనూ ఈ కేసులు నమోదైనట్లు పేర్కొంది. దీన్ని 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే, ఈ వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications