ఆ సీల్డ్ కవర్ లో ఏముంది? అదానీ హిండెన్‌బర్గ్ వివాదంలో కీలక పరిణామం!!
ఒకపక్క కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉత్కంఠ రేపుతుంటే,మరోవైపు అదానీ గ్రూప్ పై వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.హిండెన్‌బర్గ్ నివేదికపై విచారణ జరపడం కోసం సుప్రీం కోర్టు ఆరుగురు ప్యానల్ సభ్యులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల బృందం అదానీ హిండెన్‌బర్గ్ వివాదంపై నివేదికను సీల్డ్ కవర్‌లో సుప్రీం కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.
నివేదికల ప్రకారం ఇప్పుడు ఈ కేసు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు విచారణకు జాబితా చేయబడింది. మే 12 వ తేదీన దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన ఆరుగురు ప్యానల్ సభ్యుల బృందం,మరియు సెబీ దర్యాప్తు చేసిన ఫలితాలను పెట్టుబడిదారులు మరియు వాటాదారులతో పాటు.రాజకీయ వర్గాలు కూడా నిశితంగా పరిశీలిస్తాయి.

ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసి,ప్రధాని నరేంద్ర మోడీకి,అదానీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించడంతో ఈ నివేదికలో ఏమి పొందుపరిచారు అన్నదానిపైనా అందరిలోను ఆసక్తి కలుగుతుంది. అంతకు ముందు అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్నట్టుగా సెక్యూరిటీ చట్టాన్ని ఉల్లంఘించినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
సెబీ చైర్‌పర్సన్, ఏప్రిల్ 2, ఏప్రిల్ 26 తేదీలలో నిపుణుల కమిటీకి వివరణ ఇచ్చారు. అయితే రెండు నెలల్లోగా సెబీతో పాటు ఆరుగురు ప్యానల్ సభ్యుల కమిటీ తమ విచారణను పూర్తిచేయాలని సుప్రీం కోర్టు కోరింది.అయితే దీనిపై సెబీ తమ దర్యాప్తును పూర్తి చేయడానికి గత వారం ఆరు నెలల గడువు పొడిగింపును కోరింది.
ఇక తాజాగా కమిటీ సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చిందా లేక దీనిపై విచారణ జరపడానికి మరింత గడువు కావాలని కోరిందా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ కమిటీ నివేదిక ఇస్తే ఆ నివేదికలో ఏముంది అన్నది కూడా దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications