గుట్కా వద్దన్నదని అక్కను చంపేసి ఆత్మహత్య
న్యూఢిల్లీ: గుట్కా తిననివ్వలేదని కోపంతో సొంత అక్కను దారుణంగా హత్య చేసిన యువకుడు పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం సృష్టించింది.
అనారోగ్యంతో బాధపడుతున్న తమ్ముడికి బుద్దిమాటలు చెప్పినందుకు ఆమె అతని చేతిలోనే మరణించింది. నీలమ్ (24) అనే యువతి హత్యకు గురైయ్యిందని, ఆమె తమ్ముడు దీపక్ కుమార్ (21) ఆత్మహత్య చేసుకున్నాడని సోమవారం పోలీసులు చెప్పారు.
దీపక్ కుమార్ టీబీతో పాటు స్కిజోప్రేనియా వ్యాధులతో బాధపడుతున్నాడు. అన్న అనిల్ కుమార్, అక్క నీలమ్ తో కలిసి దీపక్ కుమార్ ఢిల్లీలోని మహావీర్ ఎన్ క్లేవ్ లో ఉంటున్నాడు. ఓ కంప్యూటర్ సెంటర్ లో అనీల్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు.

దీపక్ విపరీతంగా గుట్కా తినేవాడు. టీబీ కారణంగా గుట్కా తినరాదని అక్క నీలమ్ బుద్ది మాటలు చెప్పింది. అయితే దీపక్ మాట వినలేదు. అలా చెప్పిన సమయంలో దీపక్ కుటుంబ సభ్యుల మీద కోపంగా ప్రవర్తించేవాడు.
ఈ విషయంపై తరచూ అక్కతో కొట్లాడేవాడు. అప్పుడప్పుడు దీపక్ ను గదిలో పెట్టి తాళం వేసేవారు. ఉన్నట్టుండి నీలమ్, దీపక్ కనపడకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. వెంటనే అనిల్ కు ఫోన్ చేసి చెప్పారు.
ఇంటి ముందు నీలమ్ చెప్పులు ఉండటం, మెయిన్ డోర్ తాళం వేసి ఉండటంతో లోపల గాలించారు. ఓ గదిలో దీపక్ ఉరి వేసుకుని వేలాడుతున్న విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి దీపక్ మృతదేహాన్ని పోస్టుమార్టుం కు తరలించారు.
కొద్ది సేపటి తరువాత అనిల్ డబ్బులు దాచుకుంటున్న మంచం కింద ఉన్న అర (బాక్స్) లో చూశాడు. అందులో నీలమ్ మృతదేహాన్ని గుర్తించి మళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీపక్ తన అక్క నీలమ్ గొంతును చున్నీతో బిగించి హత్య చేశాడని, తరువాత భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications