అరాచకత్వం సృష్టించాలనుకున్నా:కేజ్రీ, ధర్నాపై మిశ్రమం
న్యూఢిల్లీ: రోడ్డెక్కిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) తీరు పైన మిశ్రమ స్పందన వస్తోంది. కేజ్రీవాల్ స్వయంగా ధర్నాకు దిగడంపై నెటిజన్లు స్పందించారు. కొంతమంది ఈ చర్యను రాజకీయ డ్రామాగా, ఎఎపిని పక్కన పెట్టాలని పేర్కొనగా, మరికొంతమంది ధైర్యంగా పేర్కొన్నారు.
ఎఎపి డ్రామా పైన కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ధర్నాకు దిగితే ప్రభుత్వ పాలన ఎవరు చూస్తారని, సిఎం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే కేజ్రీవాల్ ఈ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. లోకసభ ఎన్నికల్లో నెగ్గి చట్టాలని తనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చునని, అంతేకాని వీధిపోరాటాల ద్వారా ఏమీ సాధించలేరన్నారు.

కేజ్రీవాల్ ధర్నా రాజకీయ జిమ్మిక్కని బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో ఆయన అరాచక పరిస్థితులను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎఎపి ప్రస్తావిస్తున్న సమస్యలు ముఖ్యమైనవే కానీ, వారి తీరు సరికాదన్నారు. కాగా, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పిన కాంగ్రెసు, బిజెపిలు ఇప్పుడు అందుకోసం పోరాడుతున్న తమను తప్పు పట్టడమేమిటని ఎఎపి నేత యోగేంద్ర అన్నారు.
కాగా, పోలీసుల తీరుపై కేజ్రీవాల్ రోడ్డెక్కిన విషయం తెలిసిందే. కొందరు పోలీసులు లంచం తీసుకుంటూ తమ ఉన్నతాధికారులకు కూడా వాటా ఇస్తారని కేజ్రీ ఆరోపించారు. నిజాయితీ గల పోలీసులు సెలవులు పెట్టి తనతో పాటు ఆందోళనకు దిగాలని కోరారు. ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
దక్షిణ ఢిల్లీలోని డ్రగ్స్, సెక్స్ రాకెట్‌పై దాడి చేయాలన్న న్యాయ శాఖ మంత్రి సోమనాథ్ భారతి ఆదేశాలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని, మరో కేసులో చర్య తీసుకోవాలని మంత్రి రాఖీ బిర్లా కోరినా లెక్క చేయలేదని, విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం వ్యవహారంలోనూ పోలీసులు సరిగా స్పందించలేదని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆ పోలీసులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉగాండాకు చెందిన యువతిని ఉద్యోగం పేరుతో తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించినట్లు ఆ దేశ రాయబార కార్యాలయం అధికారి ఒకరు తమ మంత్రికి లేఖ ఇచ్చారని, దాని ఆధారంగానే సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. డ్రగ్, సెక్స్ రాకెట్‌పై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు లేఖలను కూడా ఆయన ప్రదర్శించారు. అయితే తాము అలాంటి లేఖ ఏదీ ఇవ్వలేదని ఉగాండా రాయబార కార్యాలయం తోసిపుచ్చింది.
తనను అరాచకవాది అంటూ కొందరు చేసిన విమర్శలపై కేజ్రీవాల్ ధీటుగా స్పందించారు. 'అవును.. నేను అరాచకవాదినే. హోంమంత్రి షిండే కోసం ఈ రోజు అరాచకత్వం సృష్టించదల్చుకున్నా' అన్నారు.
కాగా, కేజ్రీవాల్ ధర్నాతో నగరంలో మెట్రో రాకపోకలకు అంతరాయం కలిగింది. హై సెక్యూరిటీ జోన్‌లో, అది కూడా రైల్వే ప్రధాన కార్యాలయం ఎదుట ఈ ఆందోళన జరుగుతుండటంతో రైల్వే అధికారులు ముందు జాగ్రత్తగా నాలుగు మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీంతో ధర్నాలో ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొంటారని, ప్రజలెవరూ రావద్దని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మెట్రో రైళ్లను నడపాలని ఢిల్లీ కమిషనర్‌ను కోరారు. పరిస్థితిని అంచనా వేసిన అధికారులు మధ్యాహ్నం తర్వాత రెండు స్టేషన్లను తెరిచారు.
కేజ్రీవాల్ ధర్నా నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌ను సోమవారం రాత్రి కేంద్ర హోంమంత్రి షిండే కలిశారు. కేబినెట్ భేటీ పూర్తయిన వెంటనే ఆయన ప్రధానితో 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీ సిఎం వ్యవహారంపైనే చర్చించినట్లు సమాచారం.
ఢిల్లీలో పోలీసు అధికారుల బదిలీల విషయంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులను కూడా షిండే సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. పలు కేసుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారన్న ఎఎపి ప్రభుత్వ ఆరోపణలపై విచారణను వేగవంతం చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్‌ను కేంద్రం ఆదేశించింది.
ఇక కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీశ్ తివారీ వెళుతున్న కారును ఎఎపి మద్దతుదారులు అడ్డుకోవడంతో ఆయన కొంతదూరం నడవాల్సి వచ్చింది. కారును వదిలి శ్రమ శక్తి భవన్‌కు నడిచి వెళ్లి కేంద్ర మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో తివారీ భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications