నీ ప్రైవేట్ వీడియో లీక్ చేస్తాం: సుదీప్‌కు బెదిరింపు లేఖ: బీజేపీలో చేరొద్దంటూ
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కొద్దిరోజుల కిందటే షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తోన్నారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు ఇది సొంత రాష్ట్రం. ఫలితంగా ఈ ఎన్నికలను అటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. ఇప్పటివరకు వెలువడిన ఒపీనియన్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.

ఈ పరిణామాల మధ్య బీజేపీ తన వ్యూహాన్ని మార్చింది. శాండల్‌వుడ్ సూపర్ స్టార్లపై కన్నేసింది. టాప్ హీరో కిచ్చ సుదీప్, దర్శన్ తూగుదీపను పార్టీలోకి చేర్చుకోనుంది. ఈ మధ్యాహ్నం సుదీప్ బీజేపీలో చేరనున్నాడు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలో సుదీప్- కాషాయ కండువాను కప్పుకోనున్నాడు. రేపో మాపో దర్శన్ కూడా బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వారిద్దరూ కూడా బీజేపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
నిజానికి- వారిద్దరికీ ఎన్నికల ప్రచారం కొత్తేమీ కాదు 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో వారిద్దరూ కలిసి ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలత తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. కేజీఎఫ్ హీరో యష్ కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు అప్పట్లో. మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ తరువాత బీజేపీకి అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
సుదీప్ బీజేపీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి సిద్ధపడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు బెదిరింపు లేఖ అందింది. సుదీప్‌తో పాటు ఆయన మేనేజర్ జాక్ మంజును కూడా బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ లేఖను రాశారు. సుదీప్ ప్రైవేట్ వీడియో తమ వద్ద ఉందని, బీజేపీలో గనక చేరితే దాన్ని లీక్ చేస్తామంటూ బెదిరించారు. ఈ లేఖ అందిన వెంటనే మేనేజర్ జాక్ మంజు- బెంగళూరు పుట్టనహళ్లి పోలీస్ స్టేషన్‌ల్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని 504, 506, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications