అదానికి బిగ్ షాక్- సీజేఐ డీవై చంద్రచూడ్ సంచలన ఆదేశాలు జారీ..!!
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు జరిపేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం పంపించిన సీల్డ్ కవర్ ను తిరస్కరించింది.
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.

రూ.10 లక్షల కోట్లు..
గౌతమ్ అదాని సుమారు 10 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడ్డారంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. హిండన్ బర్గ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలను ప్రతివాదులుగా చేర్చారు.

గోప్యత అనవసరం..
ఇన్వెస్టర్ల హక్కులు, వారి సంపదను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుతవం సీల్డ్ కవర్ లో పంపించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. దీన్ని స్వీకరించడానికి నిరాకరించింది. కోట్లాదిమంది ఇన్వెస్టర్ల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల దీన్ని సీల్డ్ కవర్ లో పంపించాల్సిన అవసరం లేదని తెలిపింది. దీన్ని తాము స్వీకరిస్తే- కేంద్రం చేసిన సూచనలను తాము అంగీకరించినట్టవుతుందని ధర్మాసనం పేర్కొంది.

పారదర్శకత కోసం..
సీల్డ్ కవర్ లో పొందుపరిచిన సూచనలను అంగీకరిస్తే అది ప్రభుత్వం నియమించిన కమిటీగా ప్రజలు భావిస్తారని వ్యాఖ్యానించారు. అందుకే తాము దీన్ని అంగీకరించట్లేదని తేల్చి చెప్పారు. నిజాన్ని చీకట్లో ఉంచడానికి తాము ఇష్టపడట్లేదని పేర్కొన్నారు. సీల్డ్ కవర్ లో సూచనలు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పూర్తి పారదర్శకతను పాటించనక్కర్లేదా అని ప్రశ్నించింది. ఈ రిపోర్ట్ పై విచారణ చేపట్టడానికి అవసరమైన కమిటీని తామే నియమిస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

రిటైర్డ్ జడ్జీ సారథ్యంలో..
తాజాగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ పై దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దర్యాప్తు కమిటీని కూడా ప్రకటించింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రె సారథ్యాన్ని వహిస్తారు. ఈ కమిటీలో ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవదత్, ఎంవీ కామత్, నందన్ నీలకేని, సోమశేఖర్ సుందరేశన్ ఉన్నారు.

నిబంధనలు బలోపేతం..
భవిష్యత్తులో ఆర్థిక మోసాలు జరగకుండా ఎలాంటి కట్టుదిట్టమైన నియమ నిబంధనలను రూపొందాల్సి ఉంటుందనే విషయంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. దీనికి అవసరమైన సిఫారసులను సూచిస్తుంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికపై రెండు నెలల్లోగా సీల్డ్ కవర్ లో నివేదికను అందజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ మెకానిజాన్ని కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.












Click it and Unblock the Notifications