Deep Fake Videos: మోడీకి షాక్ తో కదిలిన కేంద్రం-డీప్ ఫేక్ ల కట్టడికి త్వరలో రూల్స్...
హీరోయిన్లు రష్మిక, కాజోల్, ప్రధాని మోడీ డీప్ ఫేక్ వీడియోల బారిన పడిన నేపథ్యంలో కేంద్రం వీటి కట్టడికి సిద్దమవుతోంది. ఇందుకోసం కొత్త నిబంధనల్ని తీసుకొస్తామని ఇవాళ ప్రకటించింది. డీప్‌ఫేక్‌లు ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పు అని ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం త్వరలో కొత్త నిబంధనలను తీసుకువస్తుందని తెలిపారు.
డీప్‌ఫేక్ సమస్యపై ఇవాళ సోషల్ మీడియా సంస్ధల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.
సోషల్ మీడియా సంస్ధలతో భేటీ తర్వాత, డిటెక్షన్, ప్రివెన్షన్, రిపోర్టింగ్ వ్యవస్ధల్ని బలోపేతం చేయడం, వినియోగదారుల అవగాహన పెంచడం వంటి రంగాలలో స్పష్టమైన కార్యాచరణ చేపట్టాల్సిన అవసరాన్ని ఆయా కంపెనీలు అంగీకరించాయని వైష్ణవ్ తెలిపారు. ఇవాళే తాము ఇందుకు తగిన నిబంధనల్ని రూపొందించడం ప్రారంభిస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా డీప్‌ఫేక్‌ల కట్టడి కోసం కొత్త నిబంధనలను తెస్తామన్నారు. ఇందులో ఇప్పటికే ఉన్న చట్టాల్ని సవరించడం లేదా కొత్త నియమాలు లేదా కొత్త చట్టాన్ని తీసుకురావడం కూడా ఉండవచ్చన్నారు.

వచ్చే నెల మొదటి వారంలో సోషల్ మీడియా సంస్ధలతో మరోసారి భేటీ అవుతామని, ఇవాళ తీసుకున్న నిర్ణయాలపై అప్పుడు తదుపరి చర్యలు ఉంటాయని కేంద్రమంత్రి వెల్లడించారు. అలాగే డీప్ ఫేక్ ల కట్టడికి తీసుకొచ్చే ముసాయిదా నియంత్రణలో ఏయే అంశాలు చేర్చాలన్న దానిపైనా చర్చిస్తామన్నారు. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రకటనలుస ప్రాయోజిత పోస్ట్‌ల రూపంలోనూ ఉంటున్నాయి. షారుక్ ఖాన్, విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్ వంటి వీఐపీల డీప్‌ఫేక్‌లు ఈ మధ్య కనిపించాయి. ప్రధాని మోడీ తాను కూడా స్వయంగా డీప్ ఫేక్ బాధితుడినని ప్రకటించారు. దీంతో కేంద్రం తీసుకునే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications