Bihar: 2 లక్షల గులాబ్ జామున్, మోతీ చూర్ లడ్డూలు తయ్యార్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మరికొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. గెలుపోటముల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కు అతీతంగా అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ గెలుపుపై ధీమా నెలకొంది. ఓటమిని ముందుగానే అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడట్లేదు. ఈ నేపథ్యంలో భారీ విందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల నివాసాలు, పార్టీ కార్యాలయాలు నాయకులు, కార్యకర్తల కోలాహలంతో నిండిపోయాయి.
మోకామాలోని అనంత సింగ్ నివాసంలో భారీ విందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో జేడీయూ తరపున అనంత సింగ్, ఆర్జేడీ నుంచి వీణా సింగ్ పోటీ పడ్డారు. వీరిద్దరూ కూడా బలమైన అభ్యర్థులే. అనంత సింగ్ తన గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. భారీ మెజారిటీ ఖాయమనే ధీమా జేడీయూలో నెలకొంది. అందుకే ఆయన ఇంట్లో ఇప్పటికే 56 రకాల వంటకాలతో కూడిన మహాభోజ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. ఆయన నివాస ప్రాంతం అంతా సువాసనలతో నిండిపోయింది.

ఈ వేకువ జామున 3 గంటలకే అనంత సింగ్ ఇంట్లో వంటకాల సందడి మొదలైంది. 10,000 లీటర్ల పాల ట్యాంకర్లు ఆయన ఇంటికి చేరాయి. 48 మంది మాస్టర్లు ఇక్కడ వంటకాలను వండుతున్నారు. రకరకాల స్వీట్లను తయారు చేయడంలో నిమగ్నం అయ్యారు. సుమారు రెండు లక్షల గులాబ్ జామున్‌లు సిద్ధమవుతున్నాయి. కనీసం 50 వేల మందికి మహాభోజ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
అటు జేడీయూ మిత్రపక్షం బీజేపీ క్యాంప్ లో కూడా విజయోత్సాహం కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలు తమ గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. విజయ సంబరాల కోసం 500 కిలోల మనేర్ లడ్డూలను ఆర్డర్ చేశారు. దీనికోసం కేజీల కొద్దీ జీడిపప్పు, కిస్మిస్, కర్బూజా విత్తనాలు, నెయ్యి, నూనె, శెనగపిండిని తెప్పించారు. దీంతో పాటు ఆయా పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఆలయాల బాట పట్టారు. ఓట్ల లెక్కింపు ఆరంభం కావడానికి ముందు ముందు డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా అశోక్‌ధామ్‌లోని ఇందమ్నేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు.












Click it and Unblock the Notifications