అహ్మదాబాద్ విమాన ప్రమాదం: క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన!
అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం నిన్న ఘోర ప్రమాదానికి గురైన విషయం ప్రపంచం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఆ విమానం కుప్ప కూలిన ఘటన అనేక కుటుంబాలలో తీవ్ర విషాదానికి కారణమైంది. మొత్తం ఈ దారుణ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
అహ్మదాబాద్ కు వెళ్ళి ఘటనా స్థలిని పరిశీలించిన మోదీ
ఈ ప్రమాద ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ కు వెళ్లారు. ఘటనా స్థలానికి వెళ్ళిన మోదీ అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్న తీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణికుడు, మెడికోలతో మాట్లాడిన మోదీ
అక్కడినుండి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న మోదీ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు అయిన విశ్వాస్ కుమార్ ను పరామర్శించారు. గాయపడిన ఇద్దరు మెడికోలతోనూ, మోదీ మాట్లాడి అందరికీ ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం శాఖ మంత్రి హర్ష్ సంఘవి ఉన్నారు.
ఆప్తులను కోల్పోయిన బాధ అర్ధం చేసుకోగలనన్న మోదీ
ఆ తర్వాత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ అత్యంత భయానకమైన దుర్ఘటన పైన స్పందించారు .ఇది ఊహించని విషాదమని బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. తమ ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని,ఆ ఆవేదనను తన మాటల్లో చెప్పలేనని ఆయన అన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచన అంతా బాధిత కుటుంబాల గురించేనని వెల్లడించారు.
ఎయిర్పోర్ట్ లోనే మోదీ సమీక్ష.. దర్యాప్తు ప్రారంభించిన AAIB
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఘటన పైన సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉంటే అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై, విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో - AAIB, దర్యాప్తు ప్రారంభించినట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రొటోకాల్స్ ప్రకారం ఈ దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications