విజయ్ కు మద్దతు పై AIADMK చీలక వర్గం యూ టర్న్- మళ్లీ కష్టాలు మొదలు..!!
తమిళనాడు రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. సీఎం విజయ్ అసెంబ్లీలో బల పరీక్ష వేళ మద్దతుగా నిలిచిన అన్నా డీఎంకే చీలక వర్గం ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటోంది. తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్దమైంది. ఈ మేరకు మంత్రాంగం మొదలైంది. విజయ్ కేబినెట్ విస్తరణలో తమకు అవకాశం దక్కకపోవటం పైన చీలక వర్గం నేతలు అసహనంతో ఉన్నారు. దీంతో, వీరు తిరిగి పళినిస్వామితో కలిసి పని చేసేందుకు సిద్దం అవుతున్నారు.
తమిళనాడులో విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 35 మందితో మంత్రివర్గం పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత అన్నాడీఎంకే లో పళిని స్వామి నాయకత్వాన్ని సవాల్ చేస్తూ... చీలక వర్గం విజయ్ కు మద్దతుగా నిలిచింది. అసెంబ్లీలో బల పరీక్ష సమయంలోనూ చీలక వర్గం నుంచి 25 మంది విజయ్ కు మద్దతుగా నిలిచారు. వీరు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. తమకు మంత్రి పదవులు రావని తేలిపోవడంతో మాట మార్చారు. తాము టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలకలేదని, అసలు మంత్రిపదవుల గురించి టీవీకేతో ఎలాంటి చర్చలే జరగలేదని స్పష్టం చేశారు. అసమ్మతివర్గ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం కీలక వ్యాఖ్యలు చేసారు. తమకు అధినేత...పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయాలనే తామంతా డిమాండ్ చేశాం తప్ప, మరో ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు.

మళ్లీ తెర పైకి మెజార్టీ లెక్కలు
తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే నెలకొన్నాయని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా టీవీకేకు సానుకూల తీర్పునిచ్చారని, అన్నాడీఎంకే ఎల్లప్పుడూ డీఎంకేని వ్యతిరేకించే పార్టీగానే ఉందని తెలిపారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలేమిటన్న విషయంపై చర్చించేందుకే సర్వసభ్యమండలిని సమావేశపరచాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. పార్టీని రెండుగా చీల్చే యోచనలు తమ వర్గానికి లేదని, రాష్ట్రంలో మళ్లీ జయ పాలనను స్థాపించడమే అన్నాడీఎంకే నేతలందరి ఏకైక లక్ష్యమని వేలుమణి చెప్పారు. దీంతో.. ఇప్పుడు విజయ్ బలం అసెంబ్లీలో 144 గా ఉండగా.. తిరిగి 119కి చేరినట్లుగా తెలుస్తోంది. మెజార్టీకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఎక్కువగా ఉన్నారు. దీంతో... ఇప్పుడు మిత్రపక్షాల తె విజయ్ పూర్తి సర్దుబాటు ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది. వారి డిమాండ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. మళ్లీ మెజార్టీ లెక్కలు.. విజయ్ ను వెంటాడటం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications