Air india Flight Crash: దేశ చరిత్రలోనే ఖరీదైన బీమా క్లెయిమ్-ఎన్ని వేల కోట్లో తెలుసా ?
నిన్న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఏఐ171 265 మంది ప్రాణాల్ని బలిగొంది. ఇందులో 241 మంది ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బంది, పైలట్లతో పాటు ఈ విమానం మీద పడి బీజే మెడికల్ కాలేజ్ కు చెందిన 24 మంది విద్యార్ధులు కూడా చనిపోయారు. దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విమానయాన విషాదాల్లో ఒకటిగా ఇది నిలిచింది.
ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా అంతే భారీ స్ధాయిలో ఉండబోతోంది. దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ గా ఇది నిలవబోతోంది. దీని విలువ దాదాపు రూ.2400 కోట్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని వివరాలను హౌడెన్ ఇండియా సీఈవో, ఎండీ కూడా అయిన అమిత్ అగర్వాల్ వెల్లడించారు.

దీని ప్రకారం బోయింగ్ డ్రీమ్‌లైనర్ క్రాష్ కారణంగా అగ్నిగోళంగా మారి వందల ప్రాణాలు తీసినందున హల్, లయబిలిటీ విభాగాల కింద క్లెయిమ్‌లు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విమానం ప్రస్తుత విలువ, వయస్సు, కాన్ఫిగరేషన్, ఇతర అంశాలపై ఆధారపడి ఈ క్లెయిమ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన చూస్తే దీనికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ 211 మిలియన్ డాలర్ల నుండి 280 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.
నిన్న కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం 2013 నాటిది. 2021లో దీన్ని 211 మిలియిన్ డాలర్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలుస్తోంది.దీనికి జరిగిన నష్టం చిన్నదైనా, పెద్దదైనా ఎయిర్ లైన్ సంస్థ నిర్ధారించిన విలువ ఆధారంగా క్లెయిమ్ చెల్లించనున్నారు. ప్రయాణికులకు ఇచ్చే పరిహారం మాత్రం 1999 నాటి మాంట్రియల్ ఒప్పందం ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ లెక్కన చూస్తే ఒక్కో ప్రయాణికుడి కుటుంబానికి రూ.1.47 కోట్ల పరిహారం అందనుంది. ఇప్పటికే టాటా గ్రూప్ చనిపోయిన ప్రయాణికులందరికీ కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. దీనికి ఇన్సూరెన్స్ పరిహారం అదనం.












Click it and Unblock the Notifications