Maha Kumbh: కుంభమేళాను పొడిగిస్తారా ? 50 కోట్లు దాటిన భక్తుల రాక..!
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాకు వచ్చి పుణ్యస్నానాలు చేశారు. అమృత్ స్నానం చేసే దినాల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయినా ఇవేవీ లెక్కచేయకుండా భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే ఈ నెల 26తో కుంభమేళా ముగియబోతోంది. దీంతో ఇంకా రద్దీ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో కుంభమేళాను పొడిగించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. యూపీలో ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ తాజాగా కుంభమేళా పొడిగింపు డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. గతంలో కుంభమేళాను 75 రోజులు నిర్వహించిన పరిస్ధితి ఉండేదని, ఇప్పుడు భక్తుల రద్దీ నేపథ్యంలో మళ్లీ ఆ విధానం అమల్లోకి తీసుకురావాలని అఖిలేష్ కోరుతున్నారు. ఈసారి కుంభమేళా 45 రోజులు మాత్రమే జరుగుతుంది. అంటే మరో నెల రోజుల పాటు దీన్ని పొడిగించాలని అఖిలేష్ కోరారు.

కుంభ మేళాకు ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని ఆశిస్తున్నందున, రోడ్లపైకి వచ్చే సమయాన్ని పొడిగించాలని యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో కుంభమేళా 75 రోజుల పాటు కొనసాగిందని, అయితే ప్రస్తుత షెడ్యూల్ తక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రజలు మహా కుంభ్‌కు వెళ్లాలనుకుంటున్నారని తెలిపారు. కానీ షెడ్యూల్ ముగుస్తున్నందున కుదరదని పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం కుంభమేళా గడువు పొడిగించాలన్నారు. మరోవైపు గత నెలలో జరిగిన కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట వల్ల చోటు చేసుకున్న నిజమైన మరణాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిందని అఖిలేష్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications