భారత పైలట్ల అందరూ సేఫ్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రమూకలను అంతం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అయితే గత నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగింది. పీఓకే లో 5, పాకిస్థాన్ లో 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశాయి భద్రతా దళాలు. ఈ దాడిలో 100 మంది వరకు ఉగ్రవాదులు హతం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను భారత త్రివిధ దళాధిపతులు ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు.

ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన కొన్ని అత్యాధునిక విమానాలను కూల్చి వేసినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతీ కీలక విషయాలు వెల్లడించారు. రాఫేల్ సహా.. అత్యాధునిక భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ పడగొట్టినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. భారత పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని.. ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. భారత స్థావరాలపై దాడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలను ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పకడ్బందీగా అడ్డుకుందని తెలిపారు.
ఇక మే 7-10 మధ్య జరిగిన భారత్- పాకిస్థాన్ పరస్పర దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. అలాగే ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇండియన్ ఆర్మీకి చెందిన ఐదుగురు సైనికులు వీర మరణం పొందారని.. వారి త్యాగం మరిచిపోలేమని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కొనియాడారు. అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరచిపోదని అన్నారు.
మరోవైపు అమెరికా పదేపదే భారత్, పాకిస్థాన్ వివాదాల్లో తల దూరుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాను జరిపిన చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. ట్రంప్ అలా పోస్టు పెట్టిన కొద్దిసేపటికే పాకిస్థాన్ డ్రోన్లతో కాశ్మీర్ పై దాడికి పాల్పడింది. అయితే తాజాగా మారోసారి అమెరికా ముందుకొచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఈ మేరకు ప్రధాని మోదీతో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ.. తమ వైఖరిని కుండబద్దలు కొట్టారు. పాకిస్థాన్ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. అయితే పాక్ ఎలాంటి దాడులు చేయకుంటే తాము కూడా సంయమనంతో ఉంటామని అన్నారు.
మరోవైపు ఇవాళ ఇరు దేశాల సైనికాధికారుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల సైనిక ఆపరేషన్ల డీజీల స్థాయిలో చర్చలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications