నన్ను చూస్తే అమిత్ షాకు భయం, ఆయన మతం ఏమిటి, చెప్పే దమ్ము ఉందా, సీఎం !
Recommended Video

బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నేనే అంటే భయం, అందుకే తాను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి నేనే ఏం చేస్తున్నాను అని గమనిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఏ మతంకు చెందిన వారో బహిరంగంగా ప్రజలకు చెప్పాలని చాలెంజ్ చేశారు. ఆ దమ్ము అమిత్ షాకు ఉంటే తరువాత తనను విమర్శించాలని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు.

అమిత్ షా ఎక్కడిపోతే నాకేంటి
కర్ణాటకలోని దాదాపు 40 మఠాలుకు పైగా సందర్శించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బీజేపీకి మద్దతు ఇవ్వాలని మఠాధిపతులకు మనవి చేశారు. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా మఠాలకు పోతే నాకేంటే ఇంకెక్కడికైనా పోతే నాకేంటి అని వ్యంగంగా అన్నారు.

అమిత్ షాది ఏ మతం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాను హిందువు కాదని, అందుకే హిందూ మతాన్ని చీల్చుతున్నానని, లింగాయుతలకు ప్రత్యేక మతం ఇవ్వాలని చెబుతున్నానని అమిత్ షా ఆరోపిస్తున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. అయితే అమిత్ షా హిందువా, లేక జైన మతానికి చెందిన వ్యక్తినా అనే విషయం ఆయనే బహిరంగంగా ప్రజలకు చెప్పాలని సీఎం సిద్దరామయ్య సవాలు చేశారు.

జైలుకు వెళ్లి నీతులు చెబుతారు
కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని సీఎం సిద్దరామయ్య అన్నారు. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పతో సహ బీజేపీ నాయకులు కాళ్లు అరిగేలా తిరిగినా ఉప ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఆదరించలేదని, జైలుకు వెళ్లి వచ్చిన వారందరూ ఇప్పుడు తనకు నీతులు చెబుతున్నారని సీఎం సిద్దరామయ్య ఎద్దేవ చేశారు.

చాముండేశ్వరి ఫిక్స్
మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి తాను శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని సీఎం సిద్దరామయ్య అన్నారు. అందుకే చాముండేశ్వరి నియోజక వర్గంలో పర్యటించటానికి వచ్చానని, వేరే నియోజక వర్గం మారే ఉద్దేశం తనకు లేదని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు.

మాజీ సీఎంకు ఏం తెలుసు
చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి తాను పోటీ చేస్తే కచ్చితంగా ఓడిపోతానని మాజీ సీఎం, కర్ణాటక జేడీఎస్ చీఫ్ హెచ్ డి. కుమారస్వామి చెప్పడం విడ్డూరంగా ఉందని, ఆయన జాతకాలు చెప్పుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు.

7 సార్లు పోటీ చేశాను
తాను ఎన్నిసార్లు చాముండేశ్వరి నియోజక వర్గంలో పోటీ చేశానో మాజీ సీఎం కుమారస్వామికి ఏం తెలుసు అని సిద్దరామయ్య ప్రశ్నించారు. చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి తాను గతంలో 7 సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఈసారి ఈ నియోజక వర్గంలో కచ్చితంగా గెలుస్తానని సీఎం సిద్దరామయ్యధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications