బెంగాల్ బీజేపీ మేనిఫెస్టో: సీఏఏ అమలు, 33 శాతం మహిళా రిజర్వేషన్లు, ఉద్యోగులకు 7వ పే కమిషన్..
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ.. అందుకు తగినట్లుగానే తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను 'సోనార్ బంగ్లా సంకల్ప్ పత్ర్' పేరిట ఆదివారం విడుదల చేసింది.
కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పార్టీ నేలతో కలిసి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, సీఏఏ అమలు, పీఎం కిసాన్ అరియర్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో పే కమిషన్ లాంటి కీలక హామీలతో బీజేపీ మేనిఫెస్టోను ప్రజలను ఆకట్టుకునే అంశాలను పొందుపర్చారు.

పీఎం కిసాన్ అరియర్స్‌ను రూ. 18వేల చొప్పున రాష్ట్రంలో 75 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు కోసం తొలి కేబినెట్ భేటీలోనే ఆమోద ముద్ర వేస్తామని స్పష్టం చేసింది. 70 ఏళ్లుగా రాష్ట్రంలో నివాసముంటున్న శరణార్థులకు పౌరసత్వం కల్పించడంతోపాటు ఏటా రూ. 10వేల చొప్పున ఐదేళ్లపాటు నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది.
ఇక మేనిఫెస్టోలోని మరిన్ని కీలక హామీలను పరిశీలించినట్లయితే.. మహిళలకు కేజీ టు పీజీ ఉచిత విద్య, రాష్ట్రంలో 3 ఎయిమ్స్‌ల ఏర్పాటు, ఆయూష్మాన్ భారత్ పథకం వర్తింపు, సీఎం కార్యాలయంలో అవినీతి నిరోధానికి హెల్ప్‌లైన్, రూ. 11వేల కోట్లతో సోనార్ బంగ్లా నిధి ఏర్పాటు, బెంగాల్‌లోకి చొరబాట్లు లేకుండా కంచెల కట్టుదిట్టం, నోబెల్ బహుమతి తరహాలో ఠాగూర్ బహుమతి, అంతర్జాతీయంగా బెంగాలీ భాష గుర్తింపునకు కేంద్రం తన వంతు కృషి, పేదలకు పక్కా ఇల్లు, టాయ్‌లెట్‌ల నిర్మాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి కీలక హామీలను బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చింది. మార్చి 27 నుంచి 8 విడతల్లో బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.