పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకంలో ఎన్డీఏ భాగస్వామి ఏఐఏడీఎంకే పైచేయి సాధించింది. బీజేపీకి ఏ మాత్రం పట్టులేని దక్షిణ ప్రాంత జిల్లాల్లోని నియోజకవర్గాలను కేటాయించడంతో కమలదళం.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. బీజేపీ క్యాంప్ లో అసమ్మతి గళం తలెత్తింది. నాయకులు బహిరంగంగానే విమర్శలు చేయడం మొదలు పెట్టారు. పార్టీకి కేటాయించిన 27 సీట్లలో 17 స్థానాలు దక్షిణ, డెల్టా జిల్లాల్లోనే ఉండటాన్ని తప్పుపడుతున్నారు.
గత స్థానిక, లోక్‌సభ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచిన చెన్నైలోని 16 నియోజకవర్గాలలో బీజేపీకి మైలాపూర్ సీటు మాత్రమే లభించింది. పెరంబూర్, సైదాపేట్ నియోజకవర్గాలను టీటీవీ దినకరన్ నాయకత్వంలోని ఎంఎంఎంకే కేటాయించింది. మిగిలిన అన్ని స్థానాలను కూడా ఏఐఏడీ తన వద్దే ఉంచుకుంది. ఇది బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తోన్నారు. పైగా పెరంబూర్ లో టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.

గట్టి పట్టు ఉన్న కోయంబత్తూరులో గతంలో అడిగిన నియోజకవర్గాలు బీజేపీకి దక్కలేదు. దీంతో బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై తెరమీదికి వచ్చారు. ఏఐఏడీఎంకేతో కుదిరిన సీట్ల పంపకాలు, నియోజకవర్గాల కేటాయింపు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు. అక్కడితో ఆగలేదాయన. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ కేటాయింపును అన్యాయమైన ఒప్పందంగా భావిస్తోన్నారు అన్నామలై. జాతీయ నాయకత్వానికి అసంతృప్తిని తెలిపారు. మిత్రపక్షాల సీట్ల కేటాయింపు తర్వాతే బీజేపీ వాటాను ఖరారు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ చేయడానికి సుముఖతగా లేరని చెబుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో స్వగ్రామమైన కరూర్ జిల్లాలోని అరవకురిచ్చి నుండి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
అలాగే అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు లేని 2024 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరులో పరాజయం పాలయ్యారు. ఈసారి సింగనల్లూరు లేదా కవుండంపాలెం నియోజకవర్గాలను ఆశించారు. డీఎంకే ఆధీనంలో ఉన్న తిరుప్పూర్ సౌత్ నుండి పోటీ చేయమని బీజేపీ అగ్రనాయకత్వం ఆయనను ఒప్పించింది. ఇది అన్నామలైౌని మరింత అసహనానికి గురి చేసింది. బీజేపీని బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసినా కూడా అధిష్ఠానం పెద్దగా పట్టించుకోవట్లేదనే కోపంతో ఉన్నారని చెబుతున్నారు
అన్నాడీఎంకే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న స్థానాల్లో ఏ ఒక్క దాన్ని కూడా వదులుకోలేదు. బీజేపీ మాత్రం తన అధీనంలోని నాలుగు సీట్లలో రెండింటిని వదులుకుంది. కోయంబత్తూరు సౌత్ నుండి అతి తక్కువ మెజారిటీతో గెలిచిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ కోయంబత్తూరు నార్త్ కు మారే అవకాశం ఉంది. ఇక్కడ ఆమె కమల్ హాసన్ ను ఓడించారు గత ఎన్నికల్లో.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరునల్వేలి సీటును అన్నాడీఎంకే తన వద్దే ఉంచుకుంది. దీంతో నాగేంద్రన్ సత్తూరుకు మారనున్నారు. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ కు కేటాయించిన అయిదు స్థానాలు కఠినమైనవేనని భావిస్తున్నారు. ఈ అయిదింట్లో మూడు డీఎంకే మంత్రుల అధీనంలో ఉండగా, రెండు నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే ఎప్పుడూ గెలవలేదు.












Click it and Unblock the Notifications