అంతా ఆయనే చేశారు: పంజాబ్‌లో చావుదెబ్బకు కాంగ్రెస్ ఇచ్చిన వివరణ ఇదీ
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టాయి. ఏ రాష్ట్రంలో కూడా ఆ పార్టీకి ఆశించిన సీట్లు రాలేదు. అధికారం కాదు కదా.. కనీసం ప్రతిపక్ష స్థానానికి అవసరమైనన్ని సీట్లను కూడా దక్కించుకోలేకపోయింది హస్తం పార్టీ. ఉన్నంతలో గోవాలో మాత్రమే ఫర్వాలేదనిపించుకుంది. కంచుకోటగా ఉంటూ వచ్చిన పంజాబ్‌ను పోగొట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఊహించని పరాభవం.
పంజాబ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ రెండు చోట్లా ఓడిపోయారంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భదౌర్, చామ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గాల్లో ఛన్నీ పోటీ చేశారు. అయినప్పటికీ- విజయం ముఖం చాటేసింది. ఈ రెండు స్థానాల్లోనూ ఆయన ఘోరంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. భదౌర్‌లో ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ వుగోకే, చామ్‌కౌర్ సాహిబ్‌లో ఆప్‌కే చెందిన చరణ్‌జీత్ చేతిలో ఓడిపోయారు ఛన్నీ.

అటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధును సైతం పరాజయం పలకరించింది. సిద్ధు పోటీ చేసిన అమృత్ సర్ తూర్పు నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థిని జీవన్ జ్యోత్ కౌర్ ఘన విజయాన్ని అందుకున్నారు. మరోవంక- కాంగ్రెస్ మాజీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ సైతం ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు వారెవరూ నిలవలేకపోయారు. చేతులెత్తేశారు.
ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా స్పందించారు. కేప్టెన్ అమరీందర్ సింగ్ హయాంలో ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను అధిగమించలేకపోయామని అన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అమరీందర్ సింగ్.. తీవ్రంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని వివరించారు. అమరీందర్ సింగ్ వైఫల్యాలు- ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన చరణ్‌జీత్ సింగ్ ఛన్నీనీ వెంటాడాయని అన్నారు.
అయిదు రాష్ట్రాల్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్టీ అధిష్ఠానం సమీక్షిస్తుందని సుర్జేవాలా చెప్పుకొచ్చారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ప్రజల తీర్పును తాము గౌరవిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఓటమిని అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాన్ని పొందడంలో తాము విఫలం అయ్యామని సుర్జేవాలా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications