మళ్లీ వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ- సేమ్ ప్యాటర్న్
దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ల లీకేజీలకు పాల్పడుతున్న ముఠాల ఆటకట్టించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి ముచ్చెమటలు పట్టించేలా కఠిన శిక్షలు విధించడానికి రూపొందించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు.. రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది.
దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రాత్రి ఓ వీడియోను విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లో దీన్ని షేర్ చేశారు. పేపర్ లీక్ పై ఉక్కుపాదం మోపనున్నట్లు స్పష్టం చేశారు. పార్లమెంట్ లో నూతన యాంటీ-పేపర్ లీక్ బిల్ ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో.. దేశ విద్యావ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకువస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ఆడుకునే శక్తులపై ఎట్టి పరిస్థితుల్లోనూ దయ చూపే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

నిరుద్యోగ యువత, ప్రతిభావంతులైన విద్యార్థులకు పరీక్షల నిర్వహణలో పూర్తి న్యాయం జరగడం అత్యంత అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పేపర్ లీకేజీల సమస్య ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉత్పన్నమౌతోందని, దీనని ఓ సవాలుగా స్వీకరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వివరించారు.
అర్హులైన ప్రతి విద్యార్థికి సమాన, నిష్పక్షపాతంగా అవకాశాలు కల్పించడమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. పరీక్షల కోసం రాత్రింబగళ్లు కష్టపడే యువత తీవ్ర నిరాశకు గురికావడానికి ఈ తరహా అక్రమాలే ప్రధాన కారణమని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చట్టవ్యతిరేక సంఘటనలు మరెక్కడా పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలతో కూడిన చట్టాల ద్వారా పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పరీక్షల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం కఠిన వ్యూహాలను అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, దోషులను వేగంగా శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. కొన్నేళ్లుగా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల పేపర్ల లీకేజీలు తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీక్ తో ఇది పతాక స్థాయికి చేరింది.












Click it and Unblock the Notifications