కటిక నేలపై పడుకుని నిద్రలేకుండా... లో షుగర్.. తీహార్ జైల్లో కేజ్రీవాల్ తొలిరోజు గడిచిందిలా!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రివాల్ తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉండనున్నారు. నిన్న అరవింద్ కేజ్రీవాల్ ను కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించగా తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ కు జైలు నెంబరు రెండును కేటాయించారు. ఆయనను 14x8 విస్తీర్ణం గల సెల్లో ఉంచారు.
బాగా పడిపోయిన కేజ్రీవాల్ షుగర్ లెవల్స్
అయితే మొదటి రోజు రాత్రి కేజ్రీవాల్ కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్ర పోయినట్టు జైలు వర్గాలు వెల్లడించాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తీసుకురాగా, సెల్లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన రక్తంలో చక్కెర స్థాయి 50 కంటే తక్కువగా ఉందని వైద్యుల సూచన మేరకు మెడిసిన్స్ ఇచ్చినట్టుగా జైలు అధికారులు తెలిపారు.

కటిక నేలపైన పడుకున్న కేజ్రీవాల్
ఆపై ఆయనకు టీ ఇచ్చినట్టు రాత్రి భోజనం ఇంకా ఇంటి నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని అందించినట్టు పేర్కొన్నారు. జైల్లో ఆయనకు ఒక పరుపు, దుప్పట్లు, రెండు దిండ్లు సమకూర్చినా, కొద్దిసేపు కేజ్రీవాల్ కటిక నేలపైన పడుకున్నారని, రాత్రి సరిగా నిద్ర పోలేదని, అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ కనిపించారని జైలు వర్గాల సమాచారం.
జైలు వైద్యుల పర్యవేక్షణలో కేజ్రీవాల్
నేడు ఉదయాన్నే తన సెల్లో ధ్యానం చేసుకున్న కేజ్రీవాల్ కు అల్పాహారంలో భాగంగా రెండు బిస్కెట్లు, టీ ఇచ్చారని, అనంతరం మరోమారు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం జైలు వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారని చెబుతున్నారు. ఇక ఆయనకు ఇంటి నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని అనుమతిస్తామని, రక్తంలో షుగర్ లెవల్స్ నార్మల్ కు వచ్చే వరకు ఆయనకు వైద్యాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
జైల్లో ఆరుగురు వ్యక్తులను కలిసేందుకు కేజ్రీవాల్ కు అనుమతి
ఇక సెల్ బయట జైలు వార్డర్ తో పాటుగా, ఇద్దరు భద్రత సిబ్బందిని నియమించి, సీసీ కెమెరాల ద్వారా ఆయనను ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు అందించే సిబ్బందిని కూడా జైలుకు సమీపంలో ఉంచారు. ఇదిలా ఉంటే కోర్టు ఆదేశాల ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఆరుగురు వ్యక్తులను కలవడానికి అవకాశం ఉంది.
కేజ్రీవాల్ ను కలిసేది వీరే
అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీత, తన ఇద్దరు పిల్లలతో పాటు, ఆప్ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభావ్ కుమార్ ల పేర్లు జైలు అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. వీరిని మాత్రమే జైలు అధికారులు కేజ్రీవాల్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications