ప్రిస్కిప్షన్ లేకుండా ఈ మందులు విక్రయించొద్దు- ఆదేశాలు జారీ
న్యూఢిల్లీ: భారీ వర్షాలు.. ఉత్తరాది రాష్ట్రాలను వదలట్లేదు. నిన్న, మొన్నటివరకు కాస్త తగ్గినట్లు కనిపించిన వరదలు మళ్లీ పోటెత్తుతున్నాయి. వచ్చే 48 గంటలపాటు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అటు మహారాష్ట్రలోనూ అతి భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్ అల్లకల్లోలానికి గురయ్యాయి ఈ భారీ వర్షాల వల్ల. బియాస్, రావి, సట్లేజ్.. నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించాయి. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యమునా నది ఉప్పొంగింది. గతంలో ఎప్పుడూ లేనంత ఉగ్రరూపాన్ని ధరించింది.

ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికీ కురుస్తోన్న భారీ వర్షాల వల్ల యమునా నదికి మళ్లీ వరదపోటు సంభవించింది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. యమునా నది గరిష్ఠస్థాయి నీటిమట్టం 205.33 మీటర్లు కాగా.. ఈ సాయంత్రం 6 గంటల సమయానికి ఈ డేంజర్ లెవెల్‌ను అధిగమించింది. 205.34 మీటర్లకు చేరింది.
కాగా- భారీ వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ముసురుకుంటోన్నాయి. జ్వర పీడితులు సంఖ్య పెరుగుతోంది. జ్వర సంబంధిత అనారోగ్య సమస్యలు ఢిల్లీవాసులను పట్టి పీడిస్తోన్నాయి. జ్వరం బారిన పడిన వారితో మొహల్లా క్లినిక్స్ రద్దీగా తయారయ్యాయి. డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులు ప్రబలిపోయే ప్రమాదం ఏర్పడింది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా ఆస్పిరిన్, ఇబుప్రొఫెన్.. మందులను విక్రయించవద్దని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ చీఫ్ కేఆర్ చావ్లా ఉత్తర్వులు జారీ చేశారు.
ఆస్పిరిన్, ఇబుప్రొఫెన్‌తో పాటు డైక్లోఫెనాక్ గ్రూప్ తయారు చేసే మందులను కూడా ఈ జాబితాలో చేర్చింది. దీనికి కారణం లేకపోలేదు. సాధారణంగా డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులను నివారించడానికి ఈ మందులను వాడుతారు. ప్రిస్కిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా వాటిని వినియోగించడం వల్ల మందుల కొరత ఏర్పడుతుందనే నిర్ణయానికొచ్చింది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications