యడ్యూరప్పను అరెస్టు చెయ్యం: లోకాయుక్త
బెంగళూరు: అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప ఊపిరి పీల్చుకున్నారు. తాము యడ్యూరప్పను అరెస్టు చెయ్యమని లోకాయుక్త పోలీసులు హైకోర్టుకు స్పష్టం చేశారు.
యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం చేసి పలు చోట్ల ఉన్న భూములను అక్రమంగా డీ నోటిఫికేషన్ చేశారని లోకాయుక్త పోలీసులు కేసులు నమోదు చేశారు. పలు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
ఇదే సమయంలో యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. తన మీద లోకాయుక్త దురుద్దేశంతోనే కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ లు తయారు చేస్తున్నారని, మూడు ఎఫ్ఐఆర్ లు రద్దు చేసి విచారణ నిలిపివెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యాలని యడ్యూరప్ప అర్జీ సమర్పించారు.

గురువారం హై కోర్టులో అర్జీ విచారణ జరిగింది. లోకాయుక్త న్యాయవాది వెంకటేష్ పి. దేశాయ్ మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ ల విషయంలో యడ్యూరప్పను లోకాయుక్త పోలీసులు ఇప్పట్లో అరెస్టు చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.
లోకాయుక్త పోలీసులు సైతం తాము యడ్యూరప్పను అరెస్టు చెయ్యమని హైకోర్టులో చెప్పారు. హై కోర్టు పూర్తి వివరాలు నమోదు చేసుకుంది. అయితే కేసు దర్యాప్తు నిలిపివెయ్యడానికి నిరాకరించిన హైకోర్టు కేసు విచారణ జులై 15వ తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications