సిబిఐ: రేప్ జరగలేదు, బదౌన్ బాలికలది ఆత్మహత్యే
బదౌన్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బదౌన్ బాలికల జంట హత్యల కేసులో విచారణ జరిపిన సిబిఐ తుది నివేదిక సమర్పించింది. వారిద్దరూ హత్య చేయబడలేదని, ఆత్మహత్యే వారి మరణానికి కారణమని తేల్చిచెప్పింది.
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో గత మే నెలలో ఇద్దరు బాలికలు చెట్టుకు వేలాడుతూ కనిపించిన విషయం విదితమే. అయితే వీరిద్దరిపై అత్యాచారం జరిపి చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ పోలీసులు సైతం అత్యాచారం, హత్య నేరారోపణలతో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు.
అయితే వారిద్దరిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో బయటపడిందని, వారు ఆత్మహత్య చేసుకున్నారని సిబిఐ తన నివేదికలో పేర్కొంది. తమ సోదరిపై అత్యాచారం జరగడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, గ్రామంలోని ఇతర కులానికి చెందిన యువకులు ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో వారు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని నివేదికలో పేర్కొంది.

సిబిఐ తన తుది నివేదికను ఇక్కడి ప్రత్యేక న్యాయమూర్తి అనిల్ కుమార్‌కు సమర్పించింది. కాగా, బదౌన్ బాలికల మరణం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ సైతం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, సిబిఐ నివేదికపై బాలికల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికలు ఆత్మహత్య చేసుకుంటారనే విషయాన్ని సిబిఐ వివరించలేదని, తమకు న్యాయం జరగకపోతే తమను తాము చంపుకుంటామని మృతి చెందిన బాలికల్లోని ఒక బాలిక తండ్రి అన్నారు. బాలికలను ఐదుగురు వ్యక్తులు ఎత్తుకుపోయి, వారిపై అత్యాచారం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications