లాలూ ఫ్యామిలీకి భారీ ఊరట-భార్య, కూతురితో పాటు తనకూ సీబీఐ కోర్టు బెయిల్..
బీహార్ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇవాళ సీబీఐ కోర్టులో భారీ ఊరట లభించింది. ఉద్యోగాల కోసం భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ తో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తె మీసా భారతికి సీబీఐ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.
సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ సీబీఐ కోర్టుకు వీల్ చైర్ లోనే హాజరయ్యారు. బీహార్ లో ఉద్యోగాల కోసం భూముల కుంభకోణంలో మాజీ సీఎంలు అయిన లాలూ, ఆయన భార్య రబ్రీదేవితో పాటు పిల్లలు మీసా భారతి, తేజస్వి యాదవ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ స్కాంలో వీదందరూ లబ్ది పొందారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో వీరి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్న క్రమంలో సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన కోర్టు.. లాలూ, రబ్రీ, మీసా భారతికి బెయిల్ ఇచ్చింది.

2004 నుండి 2009 వరకు లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేసిన సమయంలో ఉద్యోగాల కోసం భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ భూముల క్రయవిక్రయాల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా రైల్వేలో అక్రమ నియామకాలు జరిగాయని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. క్విడ్ ప్రోకోగా, ఉద్యోగాలు పొందిన వారు యాదవులకు ఎక్కువ రాయితీ ధరలకు భూములను విక్రయించారని ఆరోపించింది. ఈ కుంభకోణంలో లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications