వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ ప్లస్ నోట్ల రద్దుతో కమలానికి కష్టకాలం

మోడీ ప్రత్యక్ష ప్రమేయం లేకుండా జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీకి కష్టకాలాన్ని తెచ్చి పెట్టాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ గాంధీనగర్: రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి నూతనోత్తేజాన్నిచ్చింది. ఆదరాబాదరాగా జీఎస్టీ అమలు, నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు అధికార బీజేపీకి ప్రతికూల పరిస్థితులు తెచ్చి పెట్టాయి. ప్రత్యర్థులు, నిరసన కారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కమలనాథులు ఈ దఫా ఒకవైపు హిందుత్వ కాదంటూనే మరోసారి 'వికాస్' నినాదం కింద ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పది నెలలుగా అటూ ఇటూగా నెలకోసారి.. గత 30 రోజుల్లోనే ఐదుసార్లు గుజరాత్‌లో పర్యటించారు. ప్రత్యేకించి మార్చి తర్వాత ప్రతి పర్యటన ఒక రోడ్ షోగా మారింది. తాజాగా 149 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 15 రోజుల పాటు సాగిన 'గౌరవ్ యాత్ర' ముగింపు సందర్భంగా సోమవారం గాంధీ నగర్ శివారుల్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై రొటీన్ విమర్శలు చేసేందుకు ప్రధాని మోదీ వెనుకాడలేదు.

కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పాటై మూడున్నరేళ్లవుతున్నా.. తాను చేపట్టిన అభివ్రుద్ధి గురించి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ అవినీతి మయమని, ప్రగతికి వ్యతిరేకమని 'ప్రగతి' సాధన లక్షంగా ఎన్నికల బరిలో నిలిచే శక్తి ఆ పార్టీకి లేదని సెలవిచ్చారు. కానీ తమను మరోసారి గుజరాత్ రాష్ట్రాన్ని గెలిపిస్తే జీఎస్టీ వల్ల తలెత్తిన భారాన్ని ఎలా తగ్గిస్తారో చెప్పడానికి ముందుకు రాలేదు. 2002లో అప్పటి సీఎంగా మోదీ ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల ప్రచార బరిలోముందుకు సాగితే.. ఈ దఫా 'నేను గుజరాతీ, నేను వికాస్' అన్న నినాదంతో ఎన్నికల సంగ్రామం జరుగనున్నది.

 స్ఫూర్తి దాయకంగా రాహుల్ నవ్ సర్జన్ యాత్ర

స్ఫూర్తి దాయకంగా రాహుల్ నవ్ సర్జన్ యాత్ర

22 ఏళ్ల పాటు బీజేపీ పాలన సాగిన గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల ఎజెండాను ఇతరులు నిర్దేశిస్తున్నట్లు కనిపిస్తున్నది. సౌరాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన నవ్ సర్జన్ యాత్ర స్ఫూర్తిదాయకంగా ప్రారంభమైంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా నవ్ సర్జన్ యాత్ర ‘వికాసం ఒక వెర్రి'గా మార్చేశారు‘ అనే నినాదంతో మొదలైంది. దీంతో ప్రధాని నరేంద్రమోదీ కంచుకోటగా పేరొందిన గుజరాత్ రాష్ట్రంలో కమలనాథులకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని అవగతమవుతోంది. జీఎస్టీకి వ్యతిరేకంగా చేనేత కార్మికులు భారీగా నిర్వహించిన ర్యాలీ, ఆగస్టులో ఉత్కంఠభరితంగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎన్నిక, బీజేపీ ఆధ్వర్యంలో సాగిన గౌరవ్ యాత్రను ఆటంక పరుస్తూ నిరసనలు, రాహుల్ గాంధీ ర్యాలీలకు పోటెత్తిన జనం, అమిత్ షా తనయుడు జయ్‌షా వ్యాపార లావాదేవీల్లో అవకతవకలు విపక్షానికి అస్త్రాలుగా మారాయి. అకస్మాత్‌గా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలుపొందాలని పెట్టుకున్న లక్ష్యం సాధించడం కష్ట సాధ్యంగా మారింది. నేరుగా ప్రధాని మోదీ లేకుండా 1985లో మాధవ్ సింగ్ సోలంకి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న 149 స్థానాల కంటే ఒక స్థానం ఎక్కువగా గెలుచుకోవాలని షా అభిమతం. 1995 నుంచి గెలుపొందుతున్న బీజేపీ ఏనాడూ 127 స్థానాలను దాటలేదు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా ఏనాడూ దాదాపు 39 శాతం ఓటింగ్ తగ్గలేదు.

 సోషల్ మీడియా నుంచి కమలనాథులకు ఎదురు దాడి

సోషల్ మీడియా నుంచి కమలనాథులకు ఎదురు దాడి

అక్టోబర్ మొదటి వారంలో రూ. 10, 800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రకటించారు. మరోవైపు బీజేపీ నేతలు అవిశ్రాంతంగా రాష్ట్రమంతా చుట్టి వస్తున్నారు. ఒకవైపు కేంద్రమంత్రులు స్మ్రుతి ఇరానీ, రాజ్ నాథ్ సింగ్, ఉమా భారతి, సుష్మా స్వరాజ్, సీఎంలు వసుంధర రాజె సింధియా, యోగి ఆదిత్యనాథ్ లను ప్రధాని మోదీ విస్త్రుతంగా వినియోగిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మోదీ గెలుపు కోసం 2010లో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ ప్రచారం చేశారు. 2012 ఎన్నికల్లోనూ మోదీకి దన్నుగా నిలిచారు. ఈసారి అమిత్ షా నమ్మిన బంట్లుగా ఉన్న భూపేందర్ సింగ్, ప్రదీప్ సింగ్ జడేజా, బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు జితూ వాఘానీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ తదితరులు ‘వార్ రూమ్' ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో గుజరాత్ రాష్ట్రానికి బుల్లెట్ రైలు తీసుకొస్తానన్న ప్రకటనతో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. తమ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వాట్సప్‌లో వస్తున్న సందేశాలను చూడడానికి ముందు దాని గురించి బుర్ర పెట్టి ఆలోచించాలని ప్రజలను అభ్యర్థించడం గమనార్హం. దీంతో సోషల్ మీడియా ప్రచారంలో ఈ దఫా తాము వెనుకంజ వేశామని బీజేపీ నేత అంగీకరించారు.

జీఎస్టీకి వ్యతిరేకంగా టెక్స్ టైల్ వ్యాపారుల ఆందోళన

జీఎస్టీకి వ్యతిరేకంగా టెక్స్ టైల్ వ్యాపారుల ఆందోళన

పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) మీడియా కన్వీనర్ వరుణ్ పటేల్ ఫేస్ బుక్ ఖాతాలో ‘వికాస్' ప్రచారానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. తొలుత దీన్ని రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పాటిదార్లు ప్రారంభించారు. తర్వాత అది కాంగ్రెస్ ఐటీ సెల్ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ), నోట్ల రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో విస్త్రుత ప్రచారం చేపట్టారు. జీఎస్టీ నిబంధనలు, చర్యలతో తమకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ చేనేత వ్యాపారులు నెల రోజుల పాటు సమ్మె చేయడంతో సుమారు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ సమ్మెలో పాల్గొన్న వ్యాపారులంతా సంప్రదాయంగా బీజేపీ మద్దతుదారులు. బీహార్ నుంచి సూరత్ వరకు వారంతపు రైలు సర్వీసు ప్రారంభించడం ద్వారా వ్యాపారులకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వ్యాపారుల ఆగ్రహాన్ని చల్లబరిచేందుకు ఇటీవల జీఎస్టీ స్లాబుల్లో సవరణలు తీసుకొచ్చారు. రూ. 1.50 కోట్ల లోపు టర్నోవర్ గల వ్యాపారులకు ప్రకటించిన రాయితీలేవీ గుజరాతీ వ్యాపారులకు వర్తించడం లేదు. నర్మదా రిజర్వాయర్ పరిధిలో కాల్వల నిర్మాణం పూర్తి కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేపదే నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రంలో పర్యటించడం ఆందోళనతోనేనన్న వాదనను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జితూ వాఘ్నానీ కొట్టి పారేశారు. నరేంద్ర భాయ్ గుజరాతీ పుత్రుడని, ఆయన ఎప్పుడొచ్చినా లబ్ధి చేకూరుస్తాడని, ఎల్లవేళలా తాము ఆయన రాకనే కోరుకుంటామన్నారు.

 పటేళ్ల ఆందోళన తీవ్రత పసిగట్టడంలో విఫలం

పటేళ్ల ఆందోళన తీవ్రత పసిగట్టడంలో విఫలం

తాజాగా బీజేపీ ప్రవచిత వికాస్ నినాదం విమర్శలను ఎదుర్కొంటున్నది. ఆర్థికంగా బలమైన పాటిదార్లు 12 శాతం జనాభా కావడంతోపాటు తొలిసారి బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయనున్నారు. 1980 నుంచి కాంగ్రెస్ నేత మాధవ్ సింగ్ సోలంకి ‘ఖామ్' ఫార్ములాకు వ్యతిరేకంగా పాటిదార్లు బీజేపీకి మద్దతుదార్లుగా నిలిచారు. పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 2015 జూలైలో తొలిసారి హార్దిక్ పటేల్ రంగ స్థలంపైకి వచ్చినప్పుడు వారిలో ఉన్న ఆగ్రహాన్ని బీజేపీ తక్కువగా అంచనా వేస్తూ వచ్చింది. తర్వాత తీసుకున్న పొరపాటు నిర్ణయాలు మరింత విషమంగా మారాయి. హార్దిక్ పటేల్ అరెస్టుతో 10 మంది మరణానికి దారి తీసింది. గుజరాత్ నుంచి ఆరు నెలల పాటు దూరంగా ఉండాలని కోర్టులు ఆదేశించినా బీజేపీకి హార్దిక్ పటేల్ కొరకరాని కొయ్యగా మారాడు. 25 ఏళ్ల లోపు వయస్కుడైన హార్దిక్ పటేల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి దూరంగా ఉన్నారు. కానీ సౌరాష్ట్ర, సూరత్, ఉత్తర జిల్లాలు మెహ్‌సానా, పటాన్‌ల్లోని పాటిదార్లను విస్త్రుత స్థాయిలో పలుకుబడి కలిగి ఉన్నారు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు సాగిస్తున్న హార్దిక్ పటేల్ నిర్వహించిన సభలకు భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతుండటం బీజేపీ నేతలకు నిద్ర కరువవుతున్నది. పాస్ కార్యకర్తలపై కేసులు ఉపసంహరించినా పాటిదార్లలో వ్యతిరేకత పోలేదు.

 కోలీల మద్దతుపై బీజేపీలో ఆశల ఊసులు

కోలీల మద్దతుపై బీజేపీలో ఆశల ఊసులు

ఇక దళితుల పోరాట కార్యకర్త జిగ్నేష్ మేవానీ, ఓఎస్ఎస్ ఏక్తా మంచ్ కన్వీనర్ అల్పోల్ ఠాకూర్ అట్టడుగు వర్గాలకు ప్రతినిధులుగా అవతరించడం బీజేపీకి కంటగింపుగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దళితులపై దాడులు ఆసక్తికరంగా మారాయి. పాస్ నాయకుల ద్వారా హార్దిక్ పటేల్‌తో సానుకూల ఒప్పందం దాదాపుగా ఖరారైందని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. పాస్‌కు చెందిన తొమ్మిది మంది నాయకుల్లో ఆరుగురు యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేపథ్యం గలవారే. పాస్ నాయకుల్లో 10 మంది పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. జిగ్నేశ్ మేవానీతో కాంగ్రెస్ తెర వెనుక చర్చలు జరుపుతోంది. హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మేవానీ, అల్పోక్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ స్రుష్టించిన అవకాశ వాదులని బీజేపీ కొట్టి పారేస్తున్నది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎన్నికైనప్పుడు ఆయన సామాజిక వర్గానికి చెందిన ‘కోలీ'లు సంబురాలు చేసుకోవడంతో ఓబీసీల్లో 16 శాతం మంది వాని మద్దతు లభిస్తుందని మోదీ భావిస్తున్నారు.

 రాజ్యసభ ఎన్నికల్లో ఇలా నైతిక ఓటమి

రాజ్యసభ ఎన్నికల్లో ఇలా నైతిక ఓటమి

ఆగస్టులో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ తేలిగ్గా విజయం సాధించాల్సి ఉండగా, పరిస్థితి చివరి క్షణంలో తారుమారవుతున్నదన్న సంకేతాలని కనిపించాయి. కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు శంకర్ సింఘ్ వాఘేలా సారథ్యంలో 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తెర వెనుక లావాదేవీలతో అహ్మద్ పటేల్ ను ఓడించాలన్న అమిత్ షా వ్యూహం ఫలించలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఓటును పరోక్షంగా అమిత్ షాకు చూపడం ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ ఓట్లు చెల్లకుండా పోవడంతో అహ్మద్ పటేల్ విజయం సాధించారు. తద్వారా అహ్మద్ పటేల్ ను ఓడించాలన్న వ్యూహం అమలు చేయడంలో అమిత్ షా నైతికంగా దెబ్బ తిన్నారని విపక్షాలు ఆరోపించాయి.

 నవరాత్రి ఉత్సవాల్లో దేవాలయాల్లో ఇలా పూజలు

నవరాత్రి ఉత్సవాల్లో దేవాలయాల్లో ఇలా పూజలు

ఈ ఏడాది నవ్ సర్జన్ యాత్ర పేరుతో సౌరాష్ట్ర, సెంట్రల్ గుజరాత్ జిల్లాల పరిధిలో నిర్వహించిన పర్యటనలు ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు హక్కులు నినాదంతో ఈ ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాల మీదుగా సాగిన నవ్ సర్జన్ యాత్ర చివరి వరకు కాంగ్రెస్ పార్టీ రహస్యంగా ఉంచింది. రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితులు మాత్రమే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ఇన్ చార్జీ అశోక్ గెహ్లాట్.. యువజన విద్యార్థి విభాగాల ద్వారా విద్యార్థులను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా సాగిన నవ్ సర్జన్ యాత్రలో రాహుల్ గాంధీ అతి పెద్ద ఆలయాల్లోనూ పూజలతో, యువతతో ఇష్టాగోష్టి సమావేశాలతో ఉత్సాహంగా సాగుతోంది. బీజేపీ అతివాద హిందుత్వ నినాదంపై ఆధిపత్యం సాధించగలమన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీలో కలిగింది. పర్యటనల సందర్భంగా పొరపాటున మహిళల టాయిలెట్‌లోకి వెళ్లడంపై బీజేపీ విమర్శలు గుప్పించినా దాన్ని పట్టించుకున్న వారే లేరు. కొన్ని ఆలయాల పేర్లు తెలియక పొరపాటున చెప్పడంపైనా బీజేపీ విమర్శలు చేయడానికి వెనుకాడలేదు.

 క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇలా బలహీనం

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇలా బలహీనం

అయితే ఈ దఫా రాహుల్ పరిణతితో కూడిన ప్రచారం సాగించారు. పొరపాటున కూడా ముస్లింలు, మైనారిటీల ప్రస్తావన తేకుండా ముందుచూపుతో వ్యవహరించారు. తద్వారా కులాలు, మతాల ప్రాతిపదికన బీజేపీ ఓట్ల సమీకరణ చేపట్టేందుకు వెసులుబాటు లభించకుండా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో సమర్థులైన నాయకులు లేకపోవడం, ఉన్నవారిలో అంతర్గత కుమ్ములాటల కారణంగా ఇబ్బందుల పాలవ్వడమే హస్తం పార్టీకి ఉన్న సమస్యగా మిగిలిందని విశ్లేషకులు అంటున్నారు. మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా అనునిత్యం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేశారని జీపీసీసీ అధ్యక్షుడు మోధ్వాడియా తెలిపారు. తన మద్దతుదారులకు టిక్కెట్లివ్వాలని గోల చేసేవారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వాఘేలా వైదొలగడంతో అభ్యర్థులకు స్వేచ్ఛగా టిక్కెట్లు ఇవ్వడానికి వెసులుబాటు లభించిందంటున్నారు.

English summary
Rahul Gandhi’s yatra may have added fresh impetus to Congress’s campaign, but for BJP, this election is already like few in the past. It is up against anger over GST, demonetisation, and facing rivals and protesters who have ensured that the agenda won’t be Hindutva this time but remain vikas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X