bharat bandh: నేడే భారత్ బంద్: 24 పార్టీల మద్దతు, చివరి నిమిషంలో షాకిచ్చిన హర్యానా రైతులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు మంగళవారం(డిసెంబర్ 8) తలపెట్టిన భారత్ బంద్‌కు 24 రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, సమాజ్ వాదీ పార్టీ, శివసేన, శిరోమణి అకాలీదళ్, సీపీఐఎంఎల్, పీఏజీడీ(గుప్కర్ కూటమి), తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం, ఆప్, జేడీఎస్, బీఎస్పీ, పీడబ్ల్యూపీ, బీవీఏ, ఆర్ఎస్పీ, ఫార్వార్డ్ బ్లాక్, తదితర పార్టీలు మద్దతు ప్రకటించారు.

11 గంటల నుంచి 3 గంటల వరకు భారత్ బంద్..
మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరుగుతుందని రైతులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం బంద్‌కు దూరంగా ఉండనున్నాయి. కేంద్రం ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేవరకూ తమ ఆందోళనలు కొనసాగిస్తామని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు.

కేంద్రంతో కొనసాగుతున్న చర్చలు
ఇప్పటికే ఐదు దఫాలుగా కేంద్రం చర్చలు జరిపినప్పటికీ.. ఓ కొలిక్కి రాలేదు. మరోసారి డిసెంబర్ 9న రైతు సంఘాలతో కేంద్రమంత్రులు చర్చలు జరుపనున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేస్తుంటే.. ఆ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల ప్రతినిధులు పట్టుపడుతుండటంతో ఈ చర్చలు కొలిక్కిరాకుండానే ముగుస్తున్నాయి. డిసెంబర్ 9న చర్చలు ఏమేర ఫలవంతమవుతాయో వేచిచూడాలి.

షాకిచ్చిన హర్యానా రైతులు
ఇది ఇలావుండగా, డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన తరుణంలో హర్యానాకు చెందిన పలు రైతు సంఘాలు ప్రధాని మోడీ సర్కారుకు మద్దతు పలికాయి. హర్యానాకు చెందిన 70వేల ఎఫ్‌పీఓతో కూడిన 50వేల మందికి పైగా రైతులు కేంద్రం తెచ్చిన మూడు రైతు చట్టాలకు మద్దతు పలుకుతున్నామని ప్రకటించాయి. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖలు రాశాయి. కాగా, పంజాబ్ రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ఉండగా, హర్యానాకు బీజేపీ ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాలు మధ్య పలు వివాదాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా రైతులు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు సవరణలు చేసి అమలు చేస్తామంటే ఒప్పుకుంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications