సోనియాకు లేఖ: చిరంజీవి మార్కులు కొట్టేశారా?
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి చిరంజీవి మార్కులు కొట్టేశారనే మాట వినిపిస్తోంది. మిగతా సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఈ విషయంలో వెనకబడిపోయినట్లు భావిస్తున్నారు. తన రాజీనామాను ఆమోదింపజేయాలని యుపిఎ చైర్ పర్సన్, కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయడం ద్వారా మిగతావారిపై ఆయన ఆధిక్యతను సాధించారనే మాట వినిపిస్తోంది. తాను ఆక్టోబర్ 4వ తేదీన రాజీనామాను సమర్పించానని చెబుతూ దాన్ని ఆమోదింపజేయాలని కోరుతూ ఆయన సోనియాకు శుక్రవారం లేఖ రాశారు.
పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. మంత్రివర్గ సమావేశంలో రాయల తెలంగాణకు పట్టుబట్టాలని, కనీసం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి ఒప్పించాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావుకు సూచించారు. అయితే, ఆ రెండు కూడా జరగలేదు.

అయితే, సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కావూరి సాంబశివ రావు ఏ ఊసూ ఎత్తకుండా శుక్రవారంనాడు ఢిల్లీ బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో చిరంజీవి సోనియా గాంధీకి లేఖ రాయడం ద్వారా మిగతా కేంద్ర మంత్రుల కన్నా ముందున్నారు.
రాయలసీమకు చెందిన రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోస్తాంధ్రకు చెందిన మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చిరంజీవి బాటలో నడుస్తారనే మాట వినిపిస్తోంది. రాయల తెలంగాణ కోసం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చివరి నిమిషంలో తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు.












Click it and Unblock the Notifications