భోపాల్ దుర్ఘటన కేసు : కేంద్రానికి సుప్రీం భారీ షాక్-బాధితులకు అదనపు సాయం వినతి తిరస్కరణ
1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో బాధితులుగా మారిన వారు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టులో వాదించింది.
1984లో దాదాపు 3 వేల మంది చావుకు కారణమై, వేలాది మందిని బాధితులుగా మార్చేసిన భోపాల్ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. భోపాల్ గ్యాస్ బాధితులకు యూనియన్ కార్బైడ్ సంస్ధ నుంచి అదనపు పరిహారం ఇప్పించాలంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
భోపాల్ గ్యాస్ లీక్ బాధితులకు రూ.7,844 కోట్ల విలువైన నష్టపరిహారాన్ని అదనంగా చెల్లించేలా యూనియన్ కార్బైడ్‌ను ఆదేశించాలని, కేసును మళ్లీ తెరవాలని క్యూరేటివ్ పిటిషన్‌లో కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. అయితే 1989లో సెటిల్మెంట్ సమయంలో మానవ జీవితాలకు, పర్యావరణానికి జరిగిన వాస్తవ నష్టాన్ని సరిగ్గా అంచనా వేయలేమని ప్రభుత్వం వాదించింది.
దీంతో కేంద్రం పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు..మోసం కారణంగా మాత్రమే సెటిల్‌మెంట్‌ను పక్కన పెట్టవచ్చని, కేంద్రం అలాంటి వాదన ఏమీ చేయలేదని పేర్కొంది.

1984లో చోటు చేసుకున్న భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత యూనియన్ కార్బైడ్ కంపెనీ బాధితులు, మృతుల కుటుంబ సభ్యులకు 1989లో సెటిల్మెంట్ చేసింది. అయితే అప్పట్లో వాస్తవ నష్టం ఆధారంగా ఈ సెటిల్మెంట్ జరగలేదని, కాబట్టి ఈ కేసును తిరిగి తెరవాలని, బాధితులకు అదనపు పరిహారం ఇప్పించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కానీ అందుకు తగిన ఆధారాలు సమర్పించలేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ వాజ్యాన్ని తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications