బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమయానికే జరుగుతాయి: ఈసీ స్పష్టం
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ముందే నిర్ణయించిన సమయానికే జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వర్గాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ పలు రాజకీయ పార్టీ పార్టీల నుంచి విజ్ఢప్తులు వస్తున్న నేపథ్యంలో ఈసీ వర్గాలు ఆదివారం ఈ మేరకు స్పష్టం చేశాయి.
243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 29తో ముగియనుంది. ఈ క్రమంలో ఆ గడువులోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అక్టోబర్ చివర్లో గానీ, నవంబర్‌లో గానీ ఎన్నికలు జరగనున్నాయి.

కాగా, ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తోంది. అంతేగాక, ఎన్సీపీ, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న ఎల్జేపీ కూడా వాయిదా వేయాలని కోరుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై కొన్ని పార్టీలు ఇటీవల ఈసీకి లేఖ రాసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇందుకు ఇప్పటికే పలు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
ఓటర్లకు గ్లవ్స్, పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలతోపాటు నామినేషన్, ఇంటింటి ప్రచారానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా కంటైన్మెంట్ జోన్లకు కూడా ప్రత్యేక మార్గదర్శకాలను నిర్దేశించింది ఎన్నికల సంఘం.
జేపీ నడ్డా కీలక ప్రకటన
బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీలు కలిసి పోటీ చేస్తాయని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు. తమ కూటమి బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యసమితిని ఉద్దేశించి నడ్డా ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల పని అయిపోయిందని, విపక్షాలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని విమర్శించారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బీజేపీకే దేశమంతటా ఆదరణ లభిస్తోందని జేపీ నడ్డా తెలిపారు. బీహార్ ప్రభుత్వం కరోనాతోపాటు రాష్ట్రంలో వరదలను సమర్థంగా ఎదుర్కొందని తెలిపారు. బీహార్ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని చిత్తశుద్ధితో అమలు చేశారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు.