లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడంలేదు?
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోటీకి దిగుతారంటూ కొన్నిరోజులుగా చర్చ కొనసాగుతుంది. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. నితీష్ పోటీచేస్తే తాము పూర్తిస్థాయి మద్దతిస్తామన్నారు. ఆయన ఎక్కడి నుంచి పోటీచేసినా తమ మద్దతుంటుందన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలను తాజాగా నితీష్ కుమార్ కొట్టేశారు. తాను కేవలం 2024 వరకు విపక్షాలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. ఆ పార్టీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి విపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా రెండువర్గాల మధ్య గొడవలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే యోచనలో ఆ పార్టీ నేతలున్నారంటూ ధ్వజమెత్తారు.

బీహార్ లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కొద్దిరోజుల క్రితం అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీతో బంధాన్ని తెగదెంపులు చేసుకొని విపక్ష ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది బీజేపీని షాక్‌కు గురిచేసింది. 2024 ఎన్నికల్లో నితీష్‌కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ వార్తలు వచ్చాయి. వాటిని ఆయన కొట్టిపారేశారు. విపక్షాలను ఏకం చేయడానికే ప్రయత్నిస్తానన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అన్ని పార్టీలను ఒకవేదికమీదకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈనెల 25వ తేదీన హర్యానాలో సాగే ర్యాలీకి హాజరుకాబోతున్నారు. మమతా బెనర్జీని కలుపుకొని ముందుకు వెళ్లాలని ఆయన యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications