Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎదురీత ? ఇక వాటిపైనే ఆశలు !
మధ్యప్రదేశ్ లోని 230 స్ధానాలకు ఈ నెల 17న జరగబోతున్న ఎన్నికల్లో (madhya pradesh polls 2023) అధికార బీజేపీ (BJP), విపక్ష కాంగ్రెస్ (CONGRESS) మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వంపై సహజంగానే ఉండే ప్రజావ్యతిరేకతకు తోడు సీఎం అభ్యర్ధి లేకుండానే బరిలోకి దిగుతుండటం, పెరిగిపోయిన అవినీతి, నిరుద్యోగం, ఇతరత్రా సమస్యలు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు బీజేపీ రెండే అంశాలపై ఆశలు పెట్టుకుని పోరాడుతోంది.
మధ్యప్రదేశ్ ఏ విధంగా చూసినా బీజేపీకి యూపీ, గుజరాత్ తర్వాత అత్యంత కీలకమైన రాష్ట్రం. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గాలంటే మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రంలో లభించే ఎంపీ సీట్లు అంతకంతా కీలకం. దీంతో ఇక్కడ అసెంబ్లీ పోరు నెగ్గక తప్పని పరిస్ధితి బీజేపీకి ఎదురవుతోంది. కానీ మధ్యలో 15 నెలలు మినహాయిస్తే దాదాపు పదిహేనేళ్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీపై, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈసారి గట్టెక్కేందుకు ఆయన్ను మరోసారి సీఎం అభ్యర్ధిగా ప్రకటించకుండానే బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. అంతే కాదు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులందరినీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బరిలోకి దించింది. వీరిలో ఎవరో ఒకరిని సీఎం చేస్తామని సంకేతాలు ఇస్తోంది. అయితే ఇవేవీ ఫలించేలా కనిపించడం లేదు. దీంతో కేవలం రెండు అస్త్రాలతోనే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో ఒకటి మోడీ మ్యాజిక్ అయితే రెండోది సంక్షేమ పథకాలు.
ప్రధాని మోడీ ఇప్పటికే రాష్ట్రంలో పదే పదే పర్యటనలు చేస్తున్నారు. తనను చూసి ఓటేయాలని కోరుతున్నారు. రాష్ట్రంతో సంబంధం లేని ఉదయనిధి వ్యాఖ్యలు, నితీష్ కుమార్ వ్యాఖ్యల్ని సైతం ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ను టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మోడీ మాత్రమే తమను గట్టెక్కించగలరని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. అలాగే రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా కాషాయ నేతలు భారీగా నమ్మకం పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications