బీచుల్లో డ్యాన్స్ బార్లు వద్దు: బిజెపి ఎమ్మెల్యే నిరాహార దీక్ష
పనాజి: గోవా బీచుల్లో డ్యాన్సింగ్ బార్లు మూసివేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మైఖేల్ లోబో సోమవారం నిరాహార దీక్షకు దిగారు. ముఖ్యంగా కలాంగుటె బాగా బీచ్ వెంట డ్యాన్స్ క్లబ్బులన్నీ మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వ్యభిచారాన్ని ప్రోత్సహించే విధంగా ఇవి తయారవుతున్నాయని ఆరోపించారు. పురుషులు బాగా తాగేసి ఈ పబ్బుల్లో చిందులేస్తున్న కారణంగా దాని చుట్టుపక్కల ఉన్న మహిళలంతా బాధపడాల్సి వస్తుందని అన్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రాంత మహిళలు అభద్రతకు గురి అవుతున్నారని మైఖేల్ లోబో పేర్కొన్నారు.
చట్టవిరుద్ధంగా ఇలాంటి పబ్బులను నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు. బాగా బీచు సర్కిల్ వద్ద మైఖేల్ లోబో తన మద్దతు దారులతో దీక్షకు దిగారు. గోవా బయటి వారే ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఇది ఇలా ఉండగా గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్.. ఈ విషయంపై ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మాట్లాడారు. చట్ట విరుద్ధంగా నడుస్తున్న బార్లపై చర్యలు తీసుకుంటామని సిఎం హామీ ఇచ్చారని చెప్పిన లోబో, తన నిరాహార దీక్షను కొనసాగిస్తానని తెలిపారు.
కాగా, గత వారం లోబో నేతృత్వంలో కొందరు కార్యకర్తలు చట్ట విరుద్ధంగా నడుస్తున్న నాలుగు బార్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ దాడికి సంబందించి ఎమ్మెల్యేతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications