రహస్యమిత్రుల్ని మింగేసిన బీజేపీ..! ఏపీ,తెలంగాణ నుంచి కాశ్మీర్ వరకూ ఇదే కథ..!
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు స్పష్టమైంది. జాతీయ స్ధాయిలో ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వస్తున్నప్పటికీ బీజేపీకి ఈసారి పలు రాష్ట్రాల్లో తగిలిన దెబ్బలు మాత్రం చర్చనీయాంశమవుతున్నాయి. అదే సమయంలో బీజేపీ రహస్య మిత్రులకు సైతం ఓటరు కర్రు కాల్చి వాత పెట్టాడు. ముఖ్యంగా ఏపీ నుంచి కాశ్మీర్ వరకూ ఎన్డీయేలో లేకుండా కాషాయ పార్టీకి ఇన్నాళ్లూ ఏదో విధంగా అండదండలు అందించిన ప్రతీ పార్టీకి ఓటరు తీర్పు శరాఘాతంగా మారింది.

ఏపీలో 2019 ఎన్నికల్లో భారీ స్ధాయిలో ఎంపీ సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ఈ ఐదేళ్లూ ఎన్డీయేలో చేరకుండానే బీజేపీకి పరోక్షంగా మద్దతిచ్చింది. ఇందులో పార్లమెంటులో పలు ప్రజావ్యతిరేక అందించిన మద్దతు వారికి కీలకమైంది. కేంద్ర, రాష్ట్ర సంబంధాల పేరుతో జగన్ మోడీకి ఇచ్చిన మద్దతు, అదే సమయంలో రాష్ట్రానికి ఏదీ సాధించకుండానే బేషరతుగా మద్దతుగా నిలవడం ఓటరుకు అస్సలు నచ్చలేదు. దానికి బదులుగా నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీయేలో చేరి గతంలో టీడీపీ ఎంతో కొంత సాధించుకోవడం వారికి గుర్తుంది. దీంతో మరోసారి టీడీపీకే అత్యధిక ఎంపీ సీట్లు కట్టబెట్టారు.
ఇక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణలోనూ బీజేపీకి రహస్య మిత్రులైన అన్నాడీఎంకే, బీఆర్ఎస్ కు ఓటర్లు వాతలు పెట్టారు. బీజేపీతో గతంలో పొత్తు పెట్టుకుని ఎన్డీయే భాగస్వామిగా ఉన్న అన్నా డీఎంకే.. ఆ తర్వాత అన్నామలై చేసిన వ్యాఖ్యల్ని సాకుగా చూపి కాషాయ పార్టీని వదిలించుకుంది. అయినా రహస్యంగా పొత్తు కొనసాగించింది. దీని ఫలితం ఈసారి ఎన్నికల్లో కనిపించింది. డీఎంకే కూటమి 39 సీట్లకు 39 సీట్లూ గెల్చుకోవడంతో బీజేపీ, అన్నాడీఎంకేకి షాక్ తప్పలేదు.
ఒడిశాలోనూ అదే పరిస్ధితి. గత ఐదేళ్లూ కేంద్రంలో బీజేపీకి ప్రతీ విషయంలోనూ పరోక్షంగా మద్దతిచ్చిన బీజేడీని సార్వత్రిక ఎన్నికలు వచ్చే సరికి కాషాయ పార్టీ సీట్ల సర్దుబాటు కుదరలేదనే కారణం చూపి వదిలేసింది. దీంతో అప్పటికే బీజేడీని బలహీనం చేసేసిన బీజేపీ.. అదేదో నేరుగా తమకే ఓటు వేయాలని ఓటర్లను కోరింది. ఈ నేపథ్యంలో ఓటర్లు కూడా బీజేడీకి ఓటేసి వాళ్లు మళ్లీ బీజేపీకి మద్దతివ్వడం ఎందుకు తామే నేరుగా కాషాయ పార్టీకి ఓటేస్తే సరి అనుకున్నారు. ఫలితంగా బీజేడీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమిపాలైంది.
కాశ్మీర్ లో సైతం ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాల్లో బీజేపీకి పరోక్షంగా సహకరించిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీలు ఈ ఎన్నికల్లో ఫలితం అనుభవించాయి. నేషనల్ కాన్ఫరెన్స్ తరపున పోటీ చేసిన ఒమర్ అబ్దుల్లాతో పాటు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా ఎంపీలుగా ఓడిపోయారు. దీంతో కశ్మీర్లో బీజేపీతో పరోక్షంగా అంటకాగిన ఫలితం వారు అనుభవించారు. ఇప్పటికైనా ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక స్పష్టమైన వైఖరి అనుసరిస్తే తప్ప దేశంలో రాజకీయాలు చేయలేని పరిస్ధితిని ఈసారి ఓటర్లు వారికి కల్పించారు.












Click it and Unblock the Notifications