బీజేపీ కీలక డిమాండ్లకు అయిష్టంగానే తలూపిన నితీష్..!!
బీహార్‌లో జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఆయన ఎన్డీఏ సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
ఈ ఉదయం 11: 30 గంటలకు పాట్నా గాంధీ మైదాన్ నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేబినెట్ సహచరులు హాజరు కానున్నారు. అలాగే- బీజేపీ, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

నితీష్ కుమార్ తో జరిగిన చర్చల్లో బీజేపీ తమ రెండు కీలక డిమాండ్లను సాధించుకుంది. జేడీయూ స్పీకర్ పదవిని కోరినప్పటికీ.. బీజేపీకే ఆ పదవి దక్కింది. స్పీకర్ పదవికి సంబంధించిన మరో వివాదాస్పద అంశం కూడా బీజేపీకి అనుకూలంగానే పరిష్కారమైందని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో మంత్రుల కూర్పులో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు. గతంలో ఉన్న అధికారాన్ని పంచుకున్నట్టుగానే కనిపిస్తోంది.
స్పీకర్ పదవి బీజేపీ వద్దే ఉండబోతోంది. జేడీయూ మొదట ఈ పదవిపై ఆసక్తి చూపినా.. చివరికి వెనక్కి తగ్గింది. బీజేపీ స్పీకర్ పదవిని తీసుకుంటే.. ఒకే ఉప ముఖ్యమంత్రి ఉండాలని మొదట్లో జేడీయూ సూచించింది. దీన్ని అంగీకరించడానికి బీజేపీ ససేమిరా చెప్పింది. చివరికి జేడీయూ వెనక్కి తగ్గక తప్పలేదు. బీజేపీకి స్పీకర్ పదవిని వదులుకోవడంతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల నియామకానికీ ఒప్పుకొంది. గతంలో మాదిరిగానే సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగుతారు.












Click it and Unblock the Notifications