బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త సవాల్... ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్న ప్రధాని మోదీ...
ఓవైపు కరోనా దాడి కొనసాగుతుండగానే మరోవైపు బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్ దాడి కూడా మొదలైంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూడగా... తాజాగా బిహార్‌లో వైట్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఈ ముప్పేట దాడి జనాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం(మే 21) నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
'ఇటీవలి కాలంలో దేశంలో బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త సవాల్ ఎదురవుతోంది. బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు మన హెల్త్ కేర్ వ్యవస్థను సన్నద్దం చేయాల్సిన అవసరం ఉంది.' అని మోదీ పేర్కొన్నారు. ఎక్కడైతే అనారోగ్యం ఉంటుందో.. అక్కడ చికిత్స ఉండాలని... అదే మన మంత్రా అని తెలిపారు. ఈ కరోనా సంక్షోభ కాలంలో యోగా,ఆయుష్ ప్రజలను దృఢంగా మార్చాయన్నారు. అయితే కరోనాతో దీర్ఘకాలికం పోరాడాల్సి ఉందన్నారు.

కరోనాతో మృతి చెందినవారికి ప్రధాని మోదీ సంతాపం,నివాళి ప్రకటించారు. కరోనా ఒక కనిపించని,ఎప్పటికప్పుడు రూపం మార్చుకునే శత్రువు అని... వ్యాక్సినేషన్ ప్రక్రియను దీర్ఘకాలం ముమ్మరంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా ముప్పు నుంచి చిన్నారులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారులను అనారోగ్యానికి గురిచేసే ఎన్నో వ్యాధులను మనం గతంలో ఎదుర్కొన్నామని... ఇప్పుడు కూడా చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకు తగిన చర్యలు చేపడుదామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో కోవిడ్ పరిస్ఠితులపై మోదీ తాజాగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు స్థానిక వైద్యులు,పారామెడికల్ స్టాఫ్,వైద్యారోగ్య వాఖ అధికారులతో వర్చువల్‌గా మాట్లాడారు. సెకండ్ వేవ్ కట్టడికి అవసరమైన చర్యల గురించి వారితో చర్చించారు. గురువారం(మే 20) 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు,జిల్లా మెజిస్ట్రేట్లతో ప్రధాని కరోనాపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
కాగా,ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్న సంగతి తెలిసిందే. మొదట గుజరాత్‌లో 40 కేసులు బయటపడ్డాయి. ఇందులో చాలామంది కంటిచూపు కోల్పోయారు. ఆ తర్వాత కర్ణాటక,ఢిల్లీ,తెలంగాణ,బిహార్,మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ఈ వైరస్ సోకినవారిలో కళ్లు,ముక్కు,నోటి భాగాలపై దుష్ప్రభావం ఉంటుంది. కళ్లు ఎర్రబడటం,ఛాతినొప్పి,ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్ల చుట్టూ కండరం బిగుసుకుపోయి అంధత్వానికి దారితీయవచ్చు. ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ ముక్కు ద్వారా మెదడుకు చేరితే మరణం సంభవిస్తుంది. దీనికి చికిత్స ఉందని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో వైద్య చికిత్స అందితే ప్రాణాపాయం ఉండదని అంటున్నారు.












Click it and Unblock the Notifications