అర్ధరాత్రి సీఎం ఇంటి పక్కనే క్షుద్ర పూజలు!
అప్పటివరకు ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంది. దేశంలోనే అత్యంత కీలకమైన రాజకీయ నాయకులు, వీఐపీలు నివసించే బెంగళూరులోని అత్యంత సంపన్న ప్రాంతం సదాశివనగర. 24 గంటలూ తుపాకులు పట్టిన పోలీసుల పహారా.. క్షణం క్షణం తిరిగే పెట్రోలింగ్ వాహనాలు.. కానీ, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడ కాలం నిశ్శబ్దంగా ఒక భయంకరమైన రహస్యాన్ని దాచుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి కూతవేటు దూరంలో జరిగిన ఆ ఘటన.. ఇప్పుడు ఇటు పోలీసు వర్గాలను, అటు రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచిన స్థానికులకు సీఎం నివాసానికి వెనుకవైపున్న జీబీఏ మైదానం ముందు రోడ్డుపై ఒక భీతిగొలిపే దృశ్యం సాక్షాత్కరించింది. నడిరోడ్డుపై రక్తం చిందిన ఆనవాళ్లు.. నిగూఢమైన తాంత్రిక శక్తులను ఆవాహన చేసేలా గీసిన పెద్ద వృత్తాకార ముగ్గులు.. ఆ ముగ్గుల మధ్యలో నరికిన నాటుకోడి.. చుట్టూ గుచ్చిన నిమ్మకాయలు, పూజా సామాగ్రి కనిపించాయి. చీకటి మాటున ఎవరో ఆగంతకులు అక్కడ 'క్షుద్ర పూజలు' (వామాచారం) నిర్వహించారనే నిజాన్ని గ్రహించిన స్థానికులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు.

అసలు ఇక్కడే సర్వత్రా ఉత్కంఠ రేకెత్తుతోంది. సదాశివనగర అంటే సామాన్యులు అడుగుపెట్టాలన్నా వందసార్లు ఆలోచించేంత భారీ భద్రతా వలయం ఉంటుంది. ముఖ్యమంత్రి నివాసం పక్కనే ఉండటంతో నిఘా నేత్రాలు నిరంతరం నిగనిగలాడుతుంటాయి. అలాంటి హై-సెక్యూరిటీ జోన్లోకి తాంత్రికులు ఎలా ప్రవేశించారు? పోలీసుల కళ్లు గప్పి రోడ్డుపై ముగ్గులు వేసి, కోడిని కోసి, అంత నింపాదిగా క్షుద్రపూజలు ఎలా నిర్వహించగలిగారు? ఇది కేవలం మూఢనమ్మకంతో చేసిన పనా.. లేక ముఖ్యమంత్రిని మానసికంగా దెబ్బతీయడానికి శత్రువులు పన్నిన కుట్రనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే సదాశివనగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వస్తువులను తొలగించారు. ఈ క్షుద్ర పూజల వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? అర్ధరాత్రి ఆ నడిరోడ్డుపై ఏం జరిగింది? అనే కోణంలో పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. ఈ అదృశ్య తాంత్రికుల గుట్టు రట్టయితేనే గానీ.. సీఎం నివాసం వద్ద చోటుచేసుకున్న ఈ భయంకర సస్పెన్స్‌కు తెరపడేలా లేదు!














Click it and Unblock the Notifications