రేపు అందరూ సైకిళ్లపైనే ఆఫీసులకు: సీఎం వినూత్న పిలుపు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపు జరగబోయే తన విశాఖపట్నం పర్యటనలో భాగంగా, ఆయన సైకిల్‌పై ప్రయాణించి ప్రజల్లోకి బలమైన పర్యావరణ సందేశాన్ని తీసుకెళ్లనున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తుచేస్తూ.. కేవలం మాటలతో కాకుండా స్వయంగా తానే సైకిల్ తొక్కుతూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు.
భూమి మన ఇల్లు.. ప్రకృతి మన జీవనాధారం: సీఎం ట్వీట్
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'X' (ట్విట్టర్) వేదికగా రాష్ట్ర ప్రజలకు బాధ్యతాయుతమైన పిలుపునిచ్చారు. "రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు... ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం నేటి కాలంలో ఎంతో అవసరం" అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలి.. మొక్క నాటాలి!
కాలుష్యాన్ని తగ్గించడంలో, ఇంధనాన్ని ఆదా చేయడంలో భాగంగా జూన్ 5న ప్రజలంతా సైకిళ్లు లేదా ఇ-సైకిళ్లపై ప్రయాణించాలని ముఖ్యమంత్రి కోరారు. సామాన్య ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం రేపు సైకిళ్లపై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. దీనితో పాటు, రాష్ట్రంలో పచ్చదనాన్ని భారీగా పెంచేలా పర్యావరణ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు… ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం… pic.twitter.com/UgPSImKx9N
— N Chandrababu Naidu (@ncbn) June 4, 2026
"రేపటి నా విశాఖ పర్యటనలో పాల్గొనే కార్యక్రమానికి నేను సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను. సమాజ హితం కోరి చేపడుతున్న ఈ మంచి కార్యక్రమానికి అంతా సహకరించాలని, అందరూ కలిసి రావాలని కోరుతున్నాను" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు.












Click it and Unblock the Notifications