CUET రిజల్ట్స్ వచ్చేశాయ్: స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ లింక్
దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రముఖ విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూఈటీ యూజీ (CUET UG 2026) ఫలితాలు వెల్లడయ్యాయి. కొద్దిసేపటి కిందటే వీటిని జాతీయ పరీక్షల సంస్థ (NTA) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక పోర్టల్ cuet.nta.nic.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది మే నెలలో జరిగిన ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష తుది ఫలితాల కోసం దేశవ్యాప్తంగా అభ్యర్థులు అనుక్షణం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరపడింది. ఈ సంవత్సరం సీయూఈటీ యూజీ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 15,68,867 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 11,64,098 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలతో పాటు అభ్యర్థులు వివిధ సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కులు, పొందిన పర్సంటైల్ స్కోర్ వంటి పూర్తి వివరాలను తమ వ్యక్తిగత లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి అధికారిక పోర్టల్‌లో తెలుసుకోవచ్చు.

ఫలితాలను చెక్ చేయడం ఎలా?
పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని కోసం మొదట సీయూఈటీ అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in ను సందర్శించాల్సి ఉంటుంది. హోంపేజీలో అందుబాటులో ఉన్న 'CUET UG 2026 Result' అనే లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ వెంటనే ఒక కొత్త లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి. వివరాలు సరిగ్గా ఉంటే అభ్యర్థి స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
భవిష్యత్తులో అడ్మిషన్ల ప్రక్రియకు వీలుగా విద్యార్థులు తమ స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులోని తమ పేరు, రోల్ నంబర్, ఫోటో, సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కులు, పర్సంటైల్ స్కోర్‌లను నిశితంగా పరిశీలించాలి. ఒకవేళ వీటిలో ఏవైనా అక్షర దోషాలు లేదా తప్పుడు వివరాలు గమనిస్తే, వెంటనే ఆలస్యం చేయకుండా ఎన్‌టీఏ హెల్ప్‌డెస్క్ అధికారులను సంప్రదించి అవసరమైన సవరణలు చేసుకోవాలి.
కీలక మార్పులతో తుది కీ విడుదల
ఫలితాలను ప్రకటించడానికి ముందు, పరీక్షకు సంబంధించిన తుది కీ ని ఎన్‌టీఏ మంగళవారమే అధికారికంగా వెల్లడించింది. గతంలో విడుదల చేసిన ప్రాథమిక కీ పై విద్యార్థుల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ క్రమంలో కొన్ని సాంకేతిక లోపాలను గుర్తించిన ఎన్‌టీఏ.. మొత్తం ఏడు ప్రశ్నలను తుది కీ నుంచి తొలగించింది. ఈ ప్రశ్నల తొలగింపు అభ్యర్థుల తుది మార్కుల లెక్కింపుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
ఈ విద్యా సంవత్సరానికి గాను సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్షలను కిందటి నెల 11 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా విభిన్న కేంద్రాల్లో విజయవంతంగా నిర్వహించారు. తం తుది ఫలితాలు సిద్ధం కావడంతో దేశంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో యూజీ సీట్ల కేటాయింపు, అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications