ఎమ్మెల్సీగా రాజీనామా చేసి నీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా, సిద్దమా..!!
ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాలం పూర్తి చేసుకుంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా కూటమి.. వైసీపీ కొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. సామాజిక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. తూర్పు గోదావరిలో తాజా గా వైసీపీ కాపు నేతలు భేటీ అయ్యారు. ఇటు పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. పంతం నానాజీ మాజీ సీఎం జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పై వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన సవాల్ వైరల్ అవుతోంది.
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి సవాల్ చేసారు. తాజాగా పంతం నానాజీ మాజీ సీఎం జగన్ పైన అసభ్య కర వ్యాఖ్యలు చేసారు. జగన్ కు దమ్ముంటే కడప నుంచి కాకుండా కాకినాడ రూరల్ లో తన పైన పోటీ చేయాలని సవాల్ చేస్తూ.. అనుచితమైన వ్యాఖ్యలు చేయటం పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీని పైన తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలు సీరియస్ గా స్పందించారు. పంతం నానాజీకి హెచ్చరికలు చేసారు. అదే విధంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేరుగా పంతం నానాజీకి ఛాలెంజ్ విసిరారు. తాను అదే జిల్లాకు చెందిన వ్యక్తిగా కాకినాడ రూరల్ నుంచి పోటీకి సిద్దమని ప్రకటించారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తానని, పంతం నానాజీ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని ఆయన సూచించారు.

తోట త్రిమూర్తుల సవాల్ తో..
ఒకవేళ నానాజీపై తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తోట త్రిమూర్తులు సంచలన ప్రకటన చేశారు. తాను కూడా నానాజీ కంటే ఎక్కువగా మాట్లాడగలనని, కానీ సంస్కారం అడ్డువస్తోందని ఆయన అన్నారు. అదే విధంగా వైసీపీలోని కాపు నేతల సమావేశం పైనా స్పష్టత ఇచ్చారు. తాము ఎవరికో అనుకూలంగా.. వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయలేదని.. కాపు సమస్యల పైన చర్చించేందుకు భేటీ అయ్యామని వివరించారు. కాపుల సమస్య ల పైన తాము ఎక్కడా ఉన్నా స్పందిస్తామని స్పష్టం చేసారు. రానున్న రోజుల్లో తిరుపతి, విశాఖ లోనూ కాపు సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక, ఇప్పుడు తోట త్రిమూర్తులు చేసిన సవాల్ పైన పంతం నానాజీ స్పందిస్తారా.. జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications