రేవంత్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, హైదరాబాద్ కు భారీ వరం..!!
ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ నిర్వహించిన వరుస చర్చలు ఫలించాయి. దీంతో, మెట్రో పైన కీలక అడుగు పడింది. హైదరాబాద్ మెట్రో స్వాధీనం, విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు సఫలం అయ్యాయి. తాజా నిర్ణయంతో మెట్రో స్వాధీనం.. ఫేజ్- 2 విస్తరణ కు అడ్డంకులు తొలిగిపోయాయి.
సీఎం రేవంత్ ఢిల్లీలో జరిపిన చర్చలతో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగు పడింది. సీఎం రేవంత్ సోమవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలవగా.. ఈ రోజు (మంగళవారం) కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు ఉన్నతస్థాయి సంయుక్త సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్ (రైల్వే శాఖ), జి. కిషన్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మెట్రో విస్తరణ, నిధుల సమీకరణ, కేంద్ర-రాష్ట్ర ఉమ్మడి భాగస్వామ్యంపై ఈ సమావేశంలో అందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. మెట్రో ప్రాజెక్టును ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిష్ఠాత్మక ఆర్థిక సలహా సంస్థను 'SBICAPS' (SBI Capital Markets) కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. ఈ సంస్థ ప్రధాన అంశాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వనుంది.

కన్సెల్టెంట్ నియామం.. విస్తరణ దిశగా కసరత్తు
కాగా, ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన అప్పులు, ఈక్విటీ విలువ (వాల్యూయేషన్) రుణ సేకరణపై SBICAPS రోడ్ మ్యాప్ తయారు చేస్తుంది. ఇక.. ఫేజ్-2 కింద ప్రతిపాదించిన కారిడార్ల నిర్మాణ వ్యయం ఎంత అవుతుంది? నిధుల కోసం ఏయే అంతర్జాతీయ రుణ సంస్థలను ఎంచుకోవాలి? అనే అంశాలపై నివేదిక అందిస్తుంది. ఈ కన్సల్టెంట్ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తదుపరి అడుగులు వేయాలని నిర్ణయించాయి. కాగా, ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్రప్రభుత్వ ప్రతినిధితో పాటు తెలంగాణ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (MA&UD) ప్రత్యేక కార్యదర్శి సమన్వయ సభ్యులుగా వ్యవహరిస్తారు. కేంద్ర నిబంధనల ప్రకారం డీపీఆర్ లలో మార్పులు చేస్తూ, పనుల అనుమతుల ప్రక్రియను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ తాజా నిర్ణయాలతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు కేంద్ర ఆమోదం లభించడం సులభతరం కానుంది.













Click it and Unblock the Notifications