పద్మశ్రీ ఇచ్చారు కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన!
తమకు వచ్చిన అవార్డులు, సన్మానాలు కడుపు నింపవని, ప్రభుత్వం ఇచ్చిన భూమికి పట్టా దక్కక కుటుంబ సభ్యుల నిందలు భరించలేకపోతున్నానని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా భూమి పట్టా కోసం కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని ఆయన భావోద్వేగానికి గురైయాడు.
తనకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తుర్కయాంజల్ పరిధిలోని కుంట్లూరులో 600 గజాల నివాస స్థలాన్ని కేటాయించారని మొగిలయ్య తెలిపారు. ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనకు జీవో కాపీని అందించారని చెప్పారు. అయితే ఆ భూమికి సంబంధించి ఎవరో కోర్టుకు వెళ్లడంతో గత రెండేళ్లుగా సమస్య నడుస్తోందని.. లాయర్ల ఫీజుల కోసమే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన వాపోయారు.

ఇబ్రహీంపట్నం ఆర్‌డీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు..
ఈ క్రమంలోనే భూమి పట్టా సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయన ఇబ్రహీంపట్నం ఆర్‌డీఓ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడి ఆర్‌డీఓ అనంత్ రెడ్డి ఎంతో ధర్మాత్ముడని, ఆయన తనకు లాయర్‌ను పెట్టి మాట్లాడించి సహాయం చేశారని కొనియాడారు. అనంతరం హయత్ నగర్ ఎంఆర్‌ఓ మేడం కూడా ధైర్యం చెప్పారని, అయినా ఇంకా తన పేరు మీద పట్టా కాలేదని మొగిలయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
"నాకున్న కొద్ది రోజుల్లోనే ఆ భూమిని నా నలుగురు పిల్లలకు పంచి ఇవ్వాలని ఉంది. కానీ ప్రభుత్వం ఇచ్చిన భూమికి పట్టా కాకపోవడంతో ఇంట్లో పిల్లలు, కోడళ్లు నన్ను తిడుతున్నారు. నీ పద్మశ్రీ ఏంది? నీ పేరు ఏంది? అని అవమానిస్తున్నారని ఎమోషనల్ అయ్యారు.
ప్రభుత్వం స్పందించి నా భూమికి పట్టా చేయించాలి."
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా కలిసి తన బాధను చెప్పుకున్నానని, ఆయన కూడా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని మొగిలయ్య పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.












Click it and Unblock the Notifications